అనకాపల్లి : అనకాపల్లి జిల్లా పరవాడలోని జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ఇద్దరు కార్మికులు సజీవ దహనమయ్యారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడగా, వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
దక్షిణ్ ఎనర్జీ పరిశ్రమలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అగ్నిప్రమాదం సంభవించిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే అప్పటికే ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు.
ఈ ఘటనపై రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ ద్వారా స్పందించిన ఆయన, కార్మికుల మృతి అత్యంత విషాదకరమని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.
“క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. బాధిత కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుంది” అని లోకేశ్ హామీ ఇచ్చారు.
ప్రమాదంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ బాబు కూడా విచారం వ్యక్తం చేశారు. పారిశ్రామిక ప్రాంతాల్లో భద్రతా ప్రమాణాలను మరింత కట్టుదిట్టంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని పీవీఎన్ మాధవ్ పేర్కొన్నారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టారని, ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ కొనసాగుతోందని రమేశ్ బాబు తెలిపారు.
ఇప్పటికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా ఘటనపై స్పందించి మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ప్రమాదానికి దారితీసిన కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టగా, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.








