హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డికి ఒక్కటే ఎజెండా ఉందని, అది మెట్రో భూముల స్కామ్ అని ఆరోపించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన, రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న పథకాల వెనుక స్కామ్‌లు ఉన్నాయని విమర్శించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, మెట్రో సమీపంలో సుమారు 280 ఎకరాల విలువైన భూములు ఉన్నాయని, వాటి విలువ దాదాపు రూ.30 వేల కోట్లు ఉంటుందని పేర్కొన్నారు. ఈ భూములను తన కుటుంబ సభ్యులు, బంధువుల ప్రయోజనాల కోసం వినియోగించేందుకే సీఎం రేవంత్ రెడ్డి మెట్రోను స్వాధీనం చేసుకున్నారని ఆరోపించారు. ఇందుకోసం ప్రజలపై రూ.14 వేల కోట్ల భారం మోపారని విమర్శించారు.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 72 కిలోమీటర్ల మెట్రో రైలు ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేశామని కేటీఆర్ తెలిపారు. ఎయిర్పోర్ట్ మెట్రోకు సంబంధించిన టెండర్లు కూడా పూర్తి చేసి, 2023 జూన్-జులైలోనే పనులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్న సమయంలో ప్రభుత్వం మారడంతో ఆ ప్రాజెక్టును రద్దు చేశారని ఆరోపించారు. ఇది పూర్తిగా ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమైన నిర్ణయమని, “తుగ్లక్ నిర్ణయం”గా అభివర్ణించారు.
ఎయిర్పోర్ట్ మెట్రో ప్రాజెక్టు కొనసాగి ఉంటే ఈ పాటికి పూర్తయ్యేదని, భూసేకరణ సమస్యలు లేకుండా ఔటర్ రింగ్ రోడ్డును అనుసంధానం చేసి ట్రాఫిక్ సమస్యలను గణనీయంగా తగ్గించే ప్రణాళికను రూపొందించామని ఆయన తెలిపారు.
ప్రస్తుతం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి కలిసి ఢిల్లీలో కొత్త రాజకీయ నాటకానికి తెరలేపారని కేటీఆర్ విమర్శించారు. రాష్ట్రంలో మెట్రో విస్తరణ పనులు తిరిగి వేగవంతం కావాలంటే 2028లో కేసీఆర్‌ను మరోసారి ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
కేటీఆర్ చేసిన ఆరోపణలు తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మెట్రో ప్రాజెక్టు, భూముల అంశాన్ని చర్చనీయాంశంగా మార్చాయి.








