పెద్దపల్లి జిల్లా, గోదావరిఖని : పెద్దపల్లి జిల్లా గోదావరిఖని రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణలో నిర్లక్ష్యం బయటపడుతోంది. విఠల్‌నగర్ 42వ డివిజన్లో అధికార పార్టీ కార్పొరేటర్ నివాసానికి సమీపంలోనే రోడ్డు పక్కన భారీగా చెత్త పేరుకుపోవడంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
స్థానికుల కథనం ప్రకారం, సింగరేణి సివిల్ పారిశుద్ధ్య కార్మికులు కార్మిక కాలనీల్లో సేకరించిన చెత్తను రోడ్డుపైనే వేస్తున్నారని ఆరోపిస్తున్నారు. చెత్తను నిల్వ చేసేందుకు ప్రత్యేక డస్ట్‌బిన్ లేదా చెత్త కుండీ ఏర్పాటు చేయకపోవడంతో వ్యర్థాలన్నీ రోడ్డుపైనే పేరుకుపోతున్నాయని అంటున్నారు.
చెత్త తొలగించేందుకు సింగరేణి పారిశుద్ధ్య సిబ్బంది రెండు రోజులకోసారి మాత్రమే వస్తుండటంతో పరిస్థితి మరింత దారుణంగా మారిందని బస్తీవాసులు చెబుతున్నారు. రోడ్డు మధ్యలో చెత్త పేరుకుపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. దుర్వాసన వెదజల్లడంతో స్థానికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నట్లు వాపోతున్నారు.
అధికార పార్టీ కార్పొరేటర్ ఇంటి సమీపంలోనే ఈ పరిస్థితి ఉంటే, మిగతా డివిజన్లో పారిశుద్ధ్య పరిస్థితి ఎలా ఉంటుందోనని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. వెంటనే అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.









