పాకాల : జూలై 22న తిరుపతిలో నిర్వహించనున్న ప్రపంచ మామిడి దినోత్సవ సదస్సుకు మామిడి రైతులు, రైతు నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఏపీ రైతు సంఘం నాయకులు డాక్టర్ టి. జనార్ధన్, జి. మునిరత్నం పిలుపునిచ్చారు.
శుక్రవారం పాకాల భారతంమిట్టలో రైతు సంఘం నాయకులు బెల్లంకొండ శ్రీనివాసులు, వెంకటరత్నం, శివారెడ్డిలతో కలిసి ప్రపంచ మామిడి దినోత్సవానికి సంబంధించిన కరపత్రాలను వారు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మామిడి రైతుల సమస్యల పరిష్కారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం ప్రకటనలు, హామీలకే పరిమితమయ్యాయని విమర్శించారు. గిట్టుబాటు ధర లేక మామిడి రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వం కిలో మామిడికి రూ.17.47 ధర ప్రకటించినప్పటికీ, క్షేత్రస్థాయిలో రైతులకు రాంపుల వద్ద కేవలం రూ.3, ఫ్యాక్టరీల వద్ద రూ.5 మాత్రమే లభించిందని తెలిపారు. దీంతో రవాణా ఖర్చులు, కోత కూలీల వ్యయం కూడా తిరిగి రాని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా మామిడి రైతులకు కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతున్నప్పటికీ ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు.
ఐకార్ కమిటీ నివేదికపై స్పష్టత కోరిన రైతు సంఘం
సీజన్ ముగిసే సమయంలో కేంద్ర ప్రభుత్వం నియమించిన ఐకార్ (ICAR) కమిటీ రైతులకు ప్రయోజనం చేకూరేలా స్పష్టమైన సిఫారసులు చేయాలని నాయకులు కోరారు. లేదంటే కమిటీ నియామకం కేవలం కంటితుడుపు చర్యగానే మిగిలిపోతుందని విమర్శించారు. అలాగే మామిడి రైతుల సంక్షేమం కోసం ప్రత్యేక మామిడి బోర్డు ఏర్పాటు చేసి, రైతుల భాగస్వామ్యంతోనే ధరలను నిర్ణయించే విధానం తీసుకురావాలని డిమాండ్ చేశారు.
తిరుపతిలో భారీ సదస్సు
జూలై 22న తిరుపతిలోని గంధమనేని శివయ్య భవన్‌లో జరిగే ప్రపంచ మామిడి దినోత్సవ సదస్సులో రైతు నాయకులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు పాల్గొని మామిడి సాగు, మార్కెటింగ్, గిట్టుబాటు ధర, రైతుల సమస్యలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణను రూపొందించనున్నట్లు తెలిపారు. గిట్టుబాటు ధర సాధన కోసం మామిడి రైతులు పెద్ద సంఖ్యలో సదస్సుకు హాజరుకావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పాకాల, కొత్తకోట ప్రాంతాలకు చెందిన రైతు నాయకులు చెంగల్ రెడ్డి, ప్రకాష్, శంకర్, నాగరాజు, రాజేంద్ర, షబ్బీర్, మధు, లోకనాథ్ సింగ్, హేమానంద తదితరులు పాల్గొన్నారు.








