హైదరాబాద్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మైనార్టీ మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలతో పాటు మైనార్టీ ఐటీఐ కళాశాలను మంజూరు చేయాలని కోరుతూ జిల్లా డీసీసీ మైనార్టీ చైర్మన్ అర్షద్ హుస్సేన్ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అజహరుద్దీన్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
హైదరాబాద్‌లోని మంత్రి కార్యాలయంలో మంగళవారం మంత్రిని కలిసిన అర్షద్ హుస్సేన్ జిల్లాలోని మైనార్టీ వర్గాలు ఎదుర్కొంటున్న విద్యా సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన జిల్లాల్లో ఒకటిగా ఉండటంతో పాటు ఇక్కడ మైనార్టీ జనాభా కూడా అధికంగా ఉందని తెలిపారు.
జిల్లాలో మైనార్టీ విద్యార్థులకు ఉన్నత విద్య, సాంకేతిక విద్య అందించే ప్రత్యేక విద్యాసంస్థలు లేకపోవడంతో ముఖ్యంగా మైనార్టీ విద్యార్థినులు, యువత ఉన్నత చదువుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని, దీంతో పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు విద్యకు దూరమవుతున్న పరిస్థితులు నెలకొన్నాయని వివరించారు.
అందువల్ల జిల్లాలో మైనార్టీ మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలతో పాటు ఐటీఐ కళాశాలను ఏర్పాటు చేస్తే పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడమే కాకుండా ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయని మంత్రికి వివరించారు.
వినతిపై మంత్రి అజహరుద్దీన్ సానుకూలంగా స్పందించినట్లు అర్షద్ హుస్సేన్ తెలిపారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి, వీలైనంత త్వరగా సమస్య పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు.








