గుత్తి, అనంతపురం జిల్లా : దళితుల సమస్యలను పరిష్కరించడంతో పాటు కులవివక్షను నిర్మూలించేందుకు సమాజం మొత్తం కదలాలని వ్యవసాయ కార్మిక సంఘం, కేవీపీఎస్ నాయకులు పిలుపునిచ్చారు. గురువారం అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని గౌతమీపురీ కాలనీలో వ్యవసాయ కార్మిక సంఘం, కేవీపీఎస్ ఆధ్వర్యంలో దళిత సామాజిక శంఖారావం జీపు జాత నిర్వహించారు.
ఈ సందర్భంగా కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఓ. నల్లప్ప, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కృష్ణమూర్తి మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 79 ఏళ్లు పూర్తయినా దళితుల జీవన పరిస్థితుల్లో ఆశించిన స్థాయిలో మార్పు రాలేదని అన్నారు.
దేశం డిజిటల్ ఇండియాగా అభివృద్ధి చెందుతోందని, 5జీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిందని చెబుతున్నప్పటికీ, అనేక దళిత కాలనీల్లో కనీస మౌలిక సదుపాయాలు కూడా లేకపోవడం బాధాకరమని వారు పేర్కొన్నారు.
“చంద్రుడిపైకి రాకెట్లు వెళ్తున్నాయి.. కానీ దళితుడి అంత్యక్రియలకు స్మశానానికి వెళ్లే రహదారి ఎందుకు లేదు? 5జీ వచ్చినా దళిత కాలనీలకు తాగునీరు ఎందుకు అందడం లేదు?” అని నాయకులు ప్రశ్నించారు. ఇంటి స్థలం, పక్కా ఇల్లు, రహదారి, తాగునీరు, విద్యుత్ వంటి కనీస అవసరాల కోసం దళితులు ఇంకా పోరాడాల్సిన పరిస్థితి ఉందన్నారు.
ఆరడుగుల జాగా కూడా ఇవ్వలేరా?
దళితులు మరణించిన తర్వాత కూడా కుల వివక్ష ఎదుర్కొంటున్న ఘటనలు సమాజానికి సిగ్గుచేటని నాయకులు అన్నారు. ప్రతి వ్యక్తికి అంత్యక్రియలు నిర్వహించుకునేందుకు కనీసం ఆరడుగుల స్థలం, స్మశానానికి వెళ్లేందుకు రహదారి, ప్రహరీ, నీరు, నీడ వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
స్మశానాలకు స్థలాలు కేటాయించేందుకు జీవో 1235ను అమలు చేయాలని వారు కోరారు. అభివృద్ధి అందరికీ అందాలంటే దళిత కాలనీల్లో మౌలిక వసతులు కల్పించడంతో పాటు సామాజిక వివక్షకు పూర్తిస్థాయిలో ముగింపు పలకాలని అన్నారు.
గ్రామాల్లో వివక్షకు చరమగీతం పాడాలి
రాజ్యాంగం అంటరానితనాన్ని నిషేధించినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కులవివక్ష కొనసాగుతుండటం ఆందోళనకరమని నాయకులు పేర్కొన్నారు. నీటి వనరులు, దేవాలయాలు, ఉపాధి ప్రదేశాలు తదితర అంశాల్లో వివక్షకు గురవుతున్నారని ఆరోపించారు.
“మైక్పై సమానత్వం గురించి మాట్లాడటం కాదు.. గ్రామాల్లోనూ సమానత్వం అమలు కావాలి” అని వారు అన్నారు. కులవివక్షకు వ్యతిరేకంగా ప్రజలు ఐక్యంగా నిలవాలని, కుల నిర్మూలన కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
దళిత కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు దళితుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 24న అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహించనున్న ధర్నాను విజయవంతం చేయాలని నాయకులు కోరారు.
ఈ కార్యక్రమంలో నిర్మల, రమేష్, మల్లేష్, రేణుక, రేవతి, సూరి, నవీన్, వన్నూరమ్మ, చందు, ఊర్మిళ తదితరులు పాల్గొన్నారు.








