contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించాలి : ఆటో డ్రైవర్లు

గోదావరిఖని : ఆటో కార్మికుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఆటో యూనియన్ జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంగా చలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా ఆటో యూనియన్ జేఏసీ అధ్యక్షులు, బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు వ్యాల్ల హరీష్ రెడ్డి పిలుపు మేరకు పెద్ద సంఖ్యలో ఆటో డ్రైవర్లు, కార్మికులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

గోదావరిఖని చౌరస్తా నుంచి వ్యాల్ల హరీష్ రెడ్డి, ఆటో యూనియన్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు మంద రవికుమార్ జెండా ఊపి ఆటో ర్యాలీని ప్రారంభించారు. ర్యాలీ అనంతరం ఆటో కార్మికులు కలెక్టరేట్‌కు చేరుకుని తమ సమస్యలపై నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా వ్యాల్ల హరీష్ రెడ్డి మాట్లాడుతూ.. 2023 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు, ప్రతి ఆటో డ్రైవర్‌కు నెలకు రూ.12 వేల జీవనభృతి, ఆటో నగర్ల ఏర్పాటు తదితర హామీలు ఇచ్చిందని గుర్తుచేశారు. అయితే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీల అమలుపై సరైన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.

మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో ఆటో డ్రైవర్లకు గిరాకీ గణనీయంగా తగ్గిపోయిందని, ఫలితంగా వేలాది కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆయన పేర్కొన్నారు. ఆటో కార్మికుల జీవనోపాధిని కాపాడేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

ఆటో కార్మికుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే ఈ నెల 24వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మె చేపట్టనున్నట్లు ఆటో యూనియన్ జేఏసీ నాయకులు ప్రకటించారు. ఈ మేరకు వ్యాల్ల హరీష్ రెడ్డి, మంద రవికుమార్ ఆధ్వర్యంలో ఆటో కార్మికులు పెద్దపల్లి జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.

ఆటో డ్రైవర్ల కుటుంబాలకు నష్టపరిహారం అందించాలని, ప్రతి ఆటో డ్రైవర్‌కు నెలకు రూ.12 వేల జీవనభృతి ఇవ్వాలని కార్మికులు డిమాండ్ చేశారు. రూ.1,000 కోట్లతో ప్రత్యేక ఆటో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, ఇన్సూరెన్స్ ప్రీమియం తగ్గించడంతో పాటు ఆటో డ్రైవర్లకు ప్రత్యేక బీమా సౌకర్యం కల్పించాలని కోరారు.

అక్రమంగా నడుస్తున్న టూ వీలర్ ట్యాక్సీలను నిషేధించాలని, రైల్వే స్టేషన్లు, బస్టాండ్ల వద్ద అధికారిక ఆటో పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. 50 ఏళ్లు పైబడిన ఆటో డ్రైవర్లకు నెలకు రూ.10 వేల గౌరవ పెన్షన్ ఇవ్వాలని, ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల ఆగడాలను నియంత్రించాలని కోరారు.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆటో మీటర్ రేట్లను పెంచాలని, ఆటోలకు స్టేట్ పర్మిట్ సౌకర్యం కల్పించాలని, ఇల్లు లేని ఆటో డ్రైవర్లకు స్థలాలు కేటాయించి ఇళ్ల నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆటో కార్మిక రంగాన్ని ప్రత్యేక పరిశ్రమగా గుర్తించాలని కోరారు.

ప్రభుత్వం తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించి తక్షణ చర్యలు చేపట్టకపోతే ఈ నెల 24 నుంచి నిరవధిక సమ్మె చేపడతామని నాయకులు స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు జాహిద్ పాషా, పోలాడి శ్రీనివాసరావు, బూరుగు వంశీకృష్ణతో పాటు ఆటో జేఏసీ నాయకులు తాండ్ర సదానందం, ఎనగందుల నాంపల్లి, బురహాన్, బండ సురేష్, జబ్బర్, కడార్ల శ్రీధర్, అన్ను బాయ్, బంధారపు కుమార్, బెక్కం శంకర్, మడ పెద్ది రమేష్, కాంపల్లి శ్రీనివాస్, చొప్పరి శ్రీనివాస్, రంగు దుర్గ ప్రసాద్, కే.వి. చందు, అనిల్ రావు, సార్ల ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :