contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

అద్దె ఇల్లు తీసుకునే ముందు జాగ్రత్త.. ఒప్పందంలోని నిబంధనలు పూర్తిగా చదవాల్సిందే

ఇల్లు అద్దెకు తీసుకోవడం అంటే కేవలం నెలవారీ అద్దె చెల్లించడం మాత్రమే కాదని, ఒప్పందంలో దాగి ఉన్న అదనపు ఖర్చులు అద్దెదారులపై తీవ్ర ఆర్థిక భారాన్ని మోపుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారీ సెక్యూరిటీ డిపాజిట్లు, అనూహ్యమైన మెయింటెనెన్స్ ఛార్జీలు, ఇతర అదనపు రుసుములు సామాన్యుల బడ్జెట్‌ను దెబ్బతీస్తున్న నేపథ్యంలో అద్దె ఒప్పందంపై సంతకం చేసేముందు పూర్తి అవగాహన కలిగి ఉండటం అవసరమని సూచిస్తున్నారు.

అద్దెదారుల హక్కుల పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘మోడల్ టెనెన్సీ యాక్ట్-2021’ ప్రకారం ఇంటి యజమానులు రెండు నెలల అద్దెకు మించి సెక్యూరిటీ డిపాజిట్ వసూలు చేయరాదు. అలాగే అద్దెదారు ఇల్లు ఖాళీ చేసిన వెంటనే డిపాజిట్‌ను తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఒప్పందంలో ముందుగా పేర్కొనకుండా మధ్యలో అద్దె పెంపు కూడా నిబంధనలకు విరుద్ధమని చట్టం స్పష్టం చేస్తోంది.

ఇంటి నిర్వహణకు సంబంధించిన బాధ్యతల విషయంలో కూడా స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. ప్రధాన మరమ్మతులు, వైట్‌వాషింగ్, ప్లంబింగ్, ఎలక్ట్రికల్ పనుల ఖర్చులను ఇంటి యజమానే భరించాల్సి ఉంటుంది. తాళాలు మార్చడం, కుళాయి వాషర్లు అమర్చడం వంటి చిన్నపాటి నిర్వహణ పనుల బాధ్యత మాత్రమే అద్దెదారుపై ఉంటుంది.

పార్కింగ్ సౌకర్యం, పెంపుడు జంతువుల నిర్వహణ రుసుము, నీరు, విద్యుత్ వంటి యుటిలిటీ బిల్లుల చెల్లింపుల విషయంలో ముందుగానే స్పష్టత తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. భవిష్యత్తులో వివాదాలకు తావులేకుండా అన్ని రకాల ఖర్చులు, బాధ్యతలను లిఖితపూర్వకంగా అద్దె ఒప్పందంలో పొందుపరచాలని చెబుతున్నారు.

అయితే, అసోం మినహా దేశంలోని చాలా రాష్ట్రాలు మోడల్ టెనెన్సీ యాక్ట్‌ను ఇంకా పూర్తిస్థాయిలో అమలు చేయలేదు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో ఇప్పటికీ పాత చట్టాలే అమల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో అద్దెదారులు ఒప్పందంలోని ప్రతి నిబంధనను క్షుణ్ణంగా పరిశీలించి, అవసరమైతే న్యాయ నిపుణుల సలహా తీసుకోవడం ద్వారా ఆర్థిక నష్టాలు, మానసిక ఒత్తిడిని నివారించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :