కాగజ్‌నగర్ : కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనను అత్యంత విజయవంతం చేసిన జిల్లా ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
మంగళవారం కాగజ్‌నగర్ పట్టణంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల మండలంలోని కొలం కొఠారి, కొత్తగూడ గ్రామాల్లో నిర్వహించిన ‘ప్రజా పరిపాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఎమ్మెల్సీ దండే విఠల్, ఆమె ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి సభలో మాట్లాడే అవకాశం ఇవ్వలేదంటూ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని పేర్కొన్నారు.
మొదటి సమావేశంలో ఎమ్మెల్యే కోవ లక్ష్మికి మాట్లాడేందుకు తగిన అవకాశం కల్పించినప్పటికీ ఆమె ప్రసంగించలేదని చెప్పారు. అనంతరం మీడియా సమావేశాలు నిర్వహిస్తూ ప్రభుత్వంపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
రెండవ సభ సమయంలో చీకటి పడటం, సమయాభావం కారణంగా కేవలం మంత్రులు, స్టేట్ క్యాబినెట్ హోదా కలిగిన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు మాత్రమే మాట్లాడే అవకాశం కల్పించాల్సి వచ్చిందని వివరించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీగా ఉన్న తనకు కూడా మాట్లాడే అవకాశం రాలేదని, జిల్లాలోని ఇతర ఎమ్మెల్యేలకు సైతం ప్రసంగించే సమయం దొరకలేదని గుర్తు చేశారు.
కేవలం సమయాభావం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని, ఇందులో ఎలాంటి రాజకీయ కోణం లేదని స్పష్టం చేశారు. ప్రతి అంశాన్ని రాజకీయ రంగు పులమడం సరికాదని పేర్కొన్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక దృష్టి, సంకల్పం ఉన్నాయని ఈ సందర్భంగా దండే విఠల్ పునరుద్ఘాటించారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల అమలుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్, కాగజ్‌నగర్ మున్సిపాలిటీ చైర్మన్, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.








