contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఖాసీంపేట శివారులో అగ్నిప్రమాదం.. 10 ఎకరాల్లో పంటలు దగ్ధం

గన్నేరువరం : కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని ఖాసీంపేట గ్రామ శివారులో ఆదివారం మధ్యాహ్నం జరిగిన అగ్నిప్రమాదం రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. బట్టపల్లి కుంట సమీపంలోని వ్యవసాయ భూముల్లో చెలరేగిన మంటలు సుమారు 10 ఎకరాల మేర వ్యాపించి పలు వ్యవసాయ పరికరాలు, గడ్డి కట్టలు దగ్ధమయ్యాయి.

స్థానికుల కథనం ప్రకారం, పారువెల్ల గ్రామానికి చెందిన రైతుల వరి పొలంలో నుంచి మంటలు ప్రారంభమై వేగంగా వ్యాపించాయి. దీంతో వడ్లూరు, పారువెల్ల, ఖాసీంపేట గ్రామాల శివారులో ఉన్న రైతుల పొలాలు ప్రభావితమయ్యాయి.

ఈ ఘటనలో ఓరుగంటి సంపత్‌కు చెందిన బోరు మోటారు వ్యవస్థ, సర్వీస్ వైర్లు, స్టార్టర్ డబ్బా, ఆస్టిక్ పైపులు, 10 స్ప్రింక్లర్ పైపులు దగ్ధమై సుమారు రూ.1.50 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపాడు.

అలాగే రైతు బొజ్జ రాములకు చెందిన 200 గడ్డి కట్టలు, 10 స్ప్రింక్లర్ పైపులు, రెండు పెద్ద తార్పాలిన్ కవర్లు, కేసింగ్ పైపు అగ్నికి ఆహుతయ్యాయి. అదనంగా పాలు తాగే దూడ మృతి చెందడంతో ఆయనకు సుమారు రూ.1 లక్ష మేర నష్టం వాటిల్లినట్లు ఆవేదన వ్యక్తం చేశారు.

వరి కొయ్యలను కాల్చవద్దని ప్రభుత్వం ఇటీవలే ఆదేశాలు జారీ చేసినప్పటికీ, పలు ప్రాంతాల్లో ఇటువంటి ఘటనలు పునరావృతమవుతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.

పొలాల్లో నిర్లక్ష్యంగా నిప్పంటించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు బాధిత రైతు కుటుంబాలకు ప్రభుత్వం న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :