గన్నేరువరం : కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల పరిధిలో గుడిసె వాసుల ధృవీకరణ ప్రక్రియతో పాటు రెండు పడకల ఇండ్ల పరిస్థితులను తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ సీనియర్ కన్సల్టెంట్ ఎస్. ఈశ్వరయ్య మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా మండలంలోని గుండ్లపల్లి, గునుకుల కొండాపూర్ గ్రామాలను సందర్శించిన ఆయన, గుడిసెల్లో నివసిస్తున్న లబ్ధిదారుల వివరాలు, వారి నివాస పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు అర్హులైన గుడిసె వాసులను గుర్తించే ప్రక్రియను సమీక్షించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.
అనంతరం గన్నేరువరం మండల కేంద్రంలోని రెండు పడకల ఇండ్లను పరిశీలించిన ఎస్. ఈశ్వరయ్య, వాటి నిర్వహణ, మౌలిక సదుపాయాలపై సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే నిర్మించిన ఇండ్ల పరిస్థితులను పరిశీలిస్తూ లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వం నిర్దేశించిన విధానాల ప్రకారం అర్హులైన ప్రతి పేద కుటుంబానికి గృహ సదుపాయం కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, అలాగే నిర్మించిన గృహాల నిర్వహణపై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని ఆయన తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి, డీఈ వెంకటరమణ, డీఈ ప్రవీణ్, డీఈ శ్రీలత, హౌసింగ్ ఏఈ మహేందర్, ఎంపీఓ సురేందర్, పంచాయతీ కార్యదర్శులు రాజేష్, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.








