రొంపిచర్ల, జూన్ 2: పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం సంతగుడిపాడు గ్రామంలో పోలీసులు విస్తృత స్థాయిలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. డీఎస్పీ ఎం. హనుమంతరావు ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ప్రత్యేక తనిఖీల్లో సుమారు 80 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
గ్రామంలోని ప్రధాన వీధులు, అనుమానాస్పద ప్రాంతాలు, వాహనాలపై పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని పలు ద్విచక్ర వాహనాలు, ఆటోరిక్షాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచడం లక్ష్యంగా ఈ కార్డన్ సెర్చ్ నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. వాహనదారులు తమ వాహనాలకు సంబంధించిన అన్ని పత్రాలను ఎల్లప్పుడూ వెంట ఉంచుకోవాలని, చట్ట నిబంధనలను పాటించాలని సూచించారు.
ఈ సందర్భంగా డీఎస్పీ హనుమంతరావు మాట్లాడుతూ నేరాల నివారణకు ఇటువంటి ఆకస్మిక తనిఖీలు కొనసాగుతాయని తెలిపారు. ప్రజలు పోలీసులకు సహకరించి అనుమానాస్పద వ్యక్తులు లేదా సంఘటనల గురించి వెంటనే సమాచారం అందించాలని కోరారు.








