contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

డబ్బు సంచులు మోసేవాళ్లకే కాంగ్రెస్‌లో పెత్తనం! : ఎల్లారెడ్డి సంచలన ఆరోపణలు

ఇల్లంతకుంట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. తనపై సస్పెన్షన్ చర్యలు తీసుకోవడంపై కాంగ్రెస్ నాయకుడు బద్దం ఎల్లారెడ్డి మండల నాయకత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

మంగళవారం విడుదల చేసిన ప్రెస్‌నోట్‌లో ఆయన పలువురు స్థానిక నాయకులపై సంచలన ఆరోపణలు చేశారు. “నన్ను సస్పెండ్ చేసే స్థాయి మండల అధ్యక్షుడికి లేదు. పార్టీని బలోపేతం చేయాల్సిన నాయకులు పైరవీలు, కమీషన్ల రాజకీయాల్లో నిమగ్నమయ్యారు” అని విమర్శించారు.

మండలంలో కొందరు నాయకులు షాడో రాజకీయాలు చేస్తూ పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని ఆరోపించిన ఆయన, రాబోయే ఎన్నికల్లో కార్యకర్తలు, ప్రజలే వారికి తగిన సమాధానం చెబుతారని అన్నారు.

గాలిపల్లి పీఏసీఎస్ చైర్మన్ పదవిని రూ.30 లక్షలకు విక్రయించారని, రైతులను మోసం చేసిన వ్యక్తులకు పార్టీలో ప్రాధాన్యం కల్పిస్తున్నారని ఆయన ఆరోపించారు. “వందలాది మంది రైతులను నష్టపరిచిన వారిని ప్రోత్సహించే రాజకీయాలకు నేను మద్దతు ఇవ్వను” అని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో నాయకుల మాట నమ్మి పార్టీలో చేరి పనిచేశానని, పార్టీ ప్రయోజనాల కోసం ప్రశ్నించినందుకే తనపై సస్పెన్షన్ చర్యలు తీసుకున్నారని ఎల్లారెడ్డి ఆరోపించారు. “పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు గుర్తింపు లేకుండా, డబ్బు సంచులు మోసేవారికే పెత్తనం ఇస్తున్నారు” అని విమర్శించారు.

“జెండా మోసిన పేద కార్యకర్తలు నలిగిపోతున్నారు. నిజం మాట్లాడే గొంతును ఎవరూ అణచలేరు” అని ఆయన పేర్కొన్నారు.

బద్దం ఎల్లారెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం ఇల్లంతకుంట మండల కాంగ్రెస్ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. అయితే ఆయన చేసిన ఆరోపణలపై మండల కాంగ్రెస్ నాయకత్వం నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :