పాకాల (తిరుపతి జిల్లా): తిరుపతి జిల్లా పాకాల మండలం ఇరంగారిపల్లి పంచాయతీ పరిధిలోని ఓ ప్రైవేటు స్థలంలో ఇటీవల కలకలం రేపిన “కాళీమాత అమ్మవారి విగ్రహం” ఉదంతం ఎట్టకేలకు సుఖాంతమైంది. దైవభక్తి పేరుతో అమాయక ప్రజలను నమ్మించి, మోసం చేయాలని చూసిన భూ యజమాని అసలు రంగు బయటపడింది. శాస్త్రీయ ఆధారాలతో అధికారులు, స్థానికులు ఈ గుట్టును రట్టు చేశారు.
అసలేం జరిగిందంటే..?
ఈ నెల మే 22వ తేదీన (శుక్రవారం) ఇరంగారిపల్లిలోని రైల్వే రిటైర్డ్ ఉద్యోగి సుబ్రహ్మణ్యంకు చెందిన స్థలంలో పనులు చేస్తుండగా ఒక కాళీమాత విగ్రహం బయటపడినట్లు ప్రచారం జరిగింది. దీనిపై భూ యజమాని సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. “రోజూ అమ్మవారు నాకు కలలోకి వచ్చి భూమిలో నుంచి తనను బయటకు తీసి పూజలు చేయమని చెప్పేది. అంతేకాదు, ఒక నాగుపాము సైతం ప్రతిరోజూ రాత్రి వేళ నా పక్కనే నిద్రించి, ఉదయాన్నే వెళ్ళిపోయేది” అంటూ నమ్మబలికాడు. దాంతో ఆ ప్రాంతంలో పూజలు, హడావుడి మొదలైంది.
పురాతత్వ శాఖ పరిశోధనతో బయటపడ్డ నిజాలు:
ఈ ఘటనపై స్థానికులు, మేధావులు తక్షణమే స్పందించారు. అమాయక ప్రజలు మోసపోకూడదనే ఉద్దేశంతో.. ఈ విగ్రహం ఏ కాలానికి చెందింది? దాన్ని చెక్కిన రాయి ఎలాంటిది? ఇది నిజంగానే పురాతనమైనదా లేక ఇటీవల కాలంలో కావాలనే పూడ్చిపెట్టారా? అనే నిజాలను శాస్త్రీయంగా పరిశోధించాలని పురాతత్వ (ఆర్కియాలజీ) శాఖ అధికారులను డిమాండ్ చేశారు. ప్రజల విజ్ఞప్తి మేరకు రంగంలోకి దిగిన అధికారులు, స్థానికులు విచారణ చేపట్టగా అసలు నిజం నిప్పులా బయటపడింది. సదరు భూ యజమాని సుబ్రహ్మణ్యం గతంలోనే ఒక శిల్పితో ఈ విగ్రహాన్ని ప్రత్యేకంగా చెక్కించినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. ఇందుకు సంబంధించిన ఫోటోలు, తిరుగులేని సాక్ష్యాలు బయటకు రావడంతో ఇదంతా ముందస్తు ప్రణాళికతో ఆడిన డ్రామా అని తేలిపోయింది.
కఠిన చర్యలకు డిమాండ్:
దేవుడి పేరుతో, మాయ మాటలతో ప్రజల సెంటిమెంట్లను ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడే ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులు, ప్రజలు కోరుతున్నారు. రిటైర్డ్ రైల్వే ఉద్యోగి అయిన సుబ్రహ్మణ్యం సమాజంలో బాధ్యతగా నడుచుకోవాల్సింది పోయి, ఇలాంటి అక్రమాలకు తెరలేపడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఎవరూ ఇలాంటి మోసాలకు పాల్పడకుండా ఉండేలా అధికారులు ఇతనికి కఠిన శిక్ష పడేలా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రజలకు విజ్ఞప్తి:
దైవభక్తిని ఆసరాగా చేసుకుని కొందరు స్వార్థపరులు చేసే ఇలాంటి మాయ మాటలను, అద్భుతాలను నమ్మి ప్రజలు మోసపోవద్దని అధికారులు, మేధావులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రతి విషయాన్ని శాస్త్రీయంగా ఆలోచించాలని కోరుతున్నారు.








