కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా – కాగజ్‌నగర్: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక”లో భాగంగా కాగజ్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. 99 రోజుల ప్రణాళికలో భాగంగా మంగళవారం మున్సిపాలిటీలోని 6వ వార్డు కాపువాడలో లబ్ధిదారులైన మహిళలకు చీరలను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమానికి 6వ వార్డు కౌన్సిలర్ ఎమ్మాజీ శారద అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్, కాగజ్‌నగర్ మున్సిపల్ చైర్‌పర్సన్ షాహిన్ సుల్తానా హాజరై మహిళలకు చీరలను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దండే విఠల్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల అభ్యున్నతి, సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని తెలిపారు. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం కావడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు వంటి పథకాలు ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నాయని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు, అధికారులు మరియు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.








