అనంతపురం : సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ)ను రాష్ట్రవ్యాప్తంగా సమర్థవంతంగా అమలు చేసి మరింత బలోపేతం చేయాలని ఆర్టీఐ మహిళా ఉపాధ్యక్షురాలు వనగొంది లక్ష్మి డిమాండ్ చేశారు. ఆదివారం అనంతపురం జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కమిషనర్ గాజుల ఆదేన్నను సమాచార హక్కు పరిరక్షణ పర్యవేక్షణ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు ఏ. హోన్నురప్ప ఆధ్వర్యంలో ఆర్టీఐ సభ్యులు దుశ్యాలువతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు.
ఈ సందర్భంగా వనగొంది లక్ష్మి మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ శాఖలు సమాచార హక్కు చట్టాన్ని సక్రమంగా అమలు చేయడం లేదని ఆరోపించారు. ముఖ్యంగా ఆర్టీఐ చట్టంలోని సెక్షన్ 4(1)(బి) ప్రకారం ప్రజలకు స్వచ్ఛందంగా సమాచారాన్ని అందుబాటులో ఉంచాల్సిన నిబంధనలను అనేక శాఖలు పాటించడం లేదని పేర్కొన్నారు.
ఆర్టీఐ చట్టం సమర్థవంతంగా అమలయ్యేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో పాటు, నిబంధనలు ఉల్లంఘిస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర సమాచార కమిషనర్ గాజుల ఆదేన్నకు వినతిపత్రం సమర్పించారు.
ఈ కార్యక్రమంలో ఆర్టీఐ వర్కింగ్ ప్రెసిడెంట్ డి. కృష్ణమూర్తి, తోట బాలన్న, వైస్ ప్రెసిడెంట్ డా. అంకె రామలింగయ్య, వైస్ ప్రెసిడెంట్ మనోజ్ కుమార్, మహిళా ఉపాధ్యక్షురాలు వనగొంది విజయలక్ష్మి, మీనా కుమారి తదితరులు పాల్గొన్నారు.








