పాకాల (తిరుపతి జిల్లా) : తిరుపతి జిల్లా పాకాల మండలం వల్లివేడు గ్రామంలో రాజకీయ, వ్యక్తిగత కక్షల నేపథ్యంలో శనివారం రాత్రి తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. టీడీపీ నాయకుడు, పాకాల మార్కెట్ కమిటీ డైరెక్టర్ వాగ్ద్యరి సతీష్ కుమార్ రెడ్డి (45)పై అదే గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ మాజీ సర్పంచ్ కటారి ప్రత్యూష్ రెడ్డి అలియాస్ నాని (40) పదునైన కత్తితో దాడి చేసిన ఘటన సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సతీష్ కుమార్ రెడ్డిని తిరుపతిలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
పోలీసులు, బాధితుడి ఫిర్యాదు ప్రకారం… గతంలో వైఎస్సార్సీపీలో పనిచేసిన సతీష్ కుమార్ రెడ్డి ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరి ప్రస్తుతం పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయ, వ్యక్తిగత విభేదాల కారణంగా నిందితుడు ప్రత్యూష్ రెడ్డి ఆయనపై కక్ష పెంచుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితుడి అనుచరుడు కాదాటి దయను కూడా గతంలో “2029లో మా ప్రభుత్వం వస్తుంది.. మిమ్మల్ని ఎవరినీ వదిలిపెట్టము” అంటూ బెదిరించినట్లు ఆరోపించారు.
శనివారం రాత్రి సుమారు 10.30 గంటల సమయంలో వల్లివేడు గ్రామం నుంచి ఎలక్ట్రికల్ సబ్‌స్టేషన్‌కు వెళ్లే మార్గంలోని బంగా రెడ్డి మామిడి తోట వద్ద సతీష్ కుమార్ రెడ్డి తన బంధువులు కాదాటి దయ, శివకుమార్ రెడ్డిలతో కలిసి మాట్లాడుకుంటుండగా నిందితుడు కారులో అక్కడికి చేరుకున్నాడు. పెద్ద శబ్దంతో సినిమా పాటలు ప్లే చేస్తూ రెచ్చగొట్టేలా ప్రవర్తించిన అనంతరం పాత రాజకీయ విభేదాలను ప్రస్తావిస్తూ వాగ్వాదానికి దిగినట్లు పోలీసులు తెలిపారు.
వాగ్వాదం తీవ్రరూపం దాల్చడంతో, హత్య చేయాలనే ఉద్దేశంతో వెంట తెచ్చుకున్న పదునైన కత్తితో సతీష్ కుమార్ రెడ్డి కడుపు భాగంలో బలంగా పొడిచినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. తీవ్ర రక్తస్రావంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలగా, నిందితుడు ఘటనాస్థలం నుంచి పరారైనట్లు సమాచారం. వెంటనే బంధువులు గాయపడిన సతీష్ కుమార్ రెడ్డిని తిరుపతిలోని నారాయణాద్రి ఆస్పత్రికి తరలించగా, ప్రస్తుతం అత్యవసర విభాగంలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు.
బాధితుడి ఫిర్యాదు మేరకు సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పాకాల పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ టి. చిన్న గోవిందు తెలిపారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడని, అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయని వెల్లడించారు.
గ్రామంలో శాంతిభద్రతలకు భంగం కలగకుండా తగిన భద్రతా చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు ఎలాంటి వదంతులను నమ్మవద్దని ఇన్స్పెక్టర్ సూచించారు. ఈ కేసుకు సంబంధించి ఎవరికైనా సమాచారం ఉంటే వెంటనే పాకాల పోలీస్ స్టేషన్‌కు తెలియజేయాలని ఆయన కోరారు.








