కరీంనగర్ : కరీంనగర్ పట్టణంలోని జ్యోతినగర్లో అమ్ము స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆషాఢ మాస గోరింటాకు సంబరాలు డాక్టర్ పి. సుజాత రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, విద్యార్థినులు పెద్ద సంఖ్యలో పాల్గొని గోరింటాకు పెట్టించుకుని సంప్రదాయ వేడుకలను ఆనందంగా జరుపుకున్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ పి. సుజాత రెడ్డి మాట్లాడుతూ ఆషాఢ మాసంలో మహిళలు గోరింటాకు పెట్టుకోవడం మన పెద్దలు అందించిన విలువైన సంప్రదాయమని తెలిపారు. భారతీయ సంస్కృతిలో గోరింటాకు కేవలం అలంకరణకే పరిమితం కాదని, ఆరోగ్యపరంగా మరియు ఆధ్యాత్మికంగా కూడా విశిష్టమైన ప్రాధాన్యం కలిగి ఉందని పేర్కొన్నారు.
ముఖ్యంగా ఆషాఢ మాసంలో వర్షాకాలం కారణంగా వచ్చే సీజనల్ వ్యాధులు, నీటిలో ఎక్కువసేపు ఉండడం వల్ల ఏర్పడే ఫంగల్ ఇన్ఫెక్షన్ల నుంచి గోరింటాకు కొంతవరకు రక్షణ కల్పించడంలో ఉపయోగపడుతుందని, శరీరంలోని వేడిని తగ్గించే గుణాలు దీనికి ఉన్నాయని వివరించారు. అలాగే గోరింటాకు సౌభాగ్యానికి ప్రతీకగా భావిస్తారని, పురాణాల ప్రకారం ఇది పార్వతీ దేవి నుంచి ఉద్భవించిందని విశ్వాసం ఉన్నందున ప్రతి మహిళ ఈ ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవాలని ఆమె కోరారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన డాక్టర్ పి. సుజాత రెడ్డిని పాల్గొన్న మహిళలు అభినందించారు.
ఈ వేడుకలో ముద్దసాని అనూష, బొద్దుల భారతి, మయూరి, లావణ్య, రేణుక, సంధ్య, రోహిణి, జయలావణ్య, గౌరీ, దేవి, అక్షయ రెడ్డి, రావికంటి మనోజ్ఞ, కొండూరి అనిల్ కుమార్, బీసీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బొల్లం లింగమూర్తి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.








