contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

రైతుబంధు డబ్బుల కోసం కన్నతల్లిని హత్య చేసిన కుమారుడికి జీవిత ఖైదు

మెదక్ జిల్లా – తూప్రాన్: రైతుబంధు డబ్బుల విషయంలో తలెత్తిన కుటుంబ కలహాలు విషాదాంతానికి దారితీసిన కేసులో కన్నతల్లిని కత్తితో హత్య చేసిన కుమారుడికి జిల్లా న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. ఈ విషయాన్ని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు సోమవారం వెల్లడించారు.

హవేళీఘనపూర్ మండలం తోగిట గ్రామానికి చెందిన పుస్థి నర్సమ్మ, లచ్చయ్య దంపతులకు ముగ్గురు కుమారులు ఉన్నారు. నర్సమ్మ తల్లి పుస్థి బాలమణి మరణించడం, రెండో కుమారుడు అనారోగ్యంతో మృతి చెందడం నేపథ్యంలో రైతుబంధు డబ్బుల పంపకాల విషయంలో కుటుంబ సభ్యుల మధ్య తరచూ విభేదాలు చోటుచేసుకునేవి.

ఈ క్రమంలో నర్సమ్మ కుమారుడు పుస్థి బాను ప్రసాద్ రైతుబంధు డబ్బుల విషయమై తల్లితో వాగ్వాదానికి దిగాడు. 2023 ఆగస్టులో జరిగిన ఈ గొడవ తీవ్రరూపం దాల్చడంతో ఆగ్రహానికి లోనైన బాను ప్రసాద్ కత్తితో తల్లిపై దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన నర్సమ్మ ఘటనాస్థలంలోనే మృతి చెందింది.

కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అప్పటి హవేళీఘనపూర్ ఎస్‌ఐ ఆనంద్ గౌడ్ కేసు నమోదు చేశారు. అనంతరం మెదక్ రూరల్ సీఐ విజయ్ కుమార్, సీఐ రాజశేఖర్ రెడ్డి సమగ్ర దర్యాప్తు నిర్వహించి, కేసుకు సంబంధించిన కీలక ఆధారాలను సేకరించి న్యాయస్థానంలో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. ప్రస్తుత సీఐ జార్జ్ విచారణ సమయంలో సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు.

కేసు విచారణ సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెంకటేష్ ప్రాసిక్యూషన్ తరఫున బలమైన వాదనలు వినిపించారు. సమర్పించిన సాక్ష్యాధారాలు, సాక్షుల వాంగ్మూలాలు మరియు ఇతర ఆధారాలను పరిశీలించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ, నిందితుడు పుస్థి బాను ప్రసాద్‌పై అభియోగాలు రుజువైనట్లు నిర్ధారించారు.

దీంతో నిందితుడికి జీవిత ఖైదు శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.

కేసులో నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన దర్యాప్తు అధికారులు, కోర్టు లైజనింగ్ ఆఫీసర్ ఎస్‌ఐ విఠల్, కానిస్టేబుల్ రవీందర్ గౌడ్, సీడీఓ ఎండీ గౌస్, ప్రాసిక్యూషన్ బృందాన్ని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు అభినందించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :