మెదక్ – తూప్రాన్: అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసి, గుడిసెలు లేని మెదక్ జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర కార్మిక, ఉపాధి, శిక్షణ, పరిశ్రమలు, గనుల భూగర్భ శాఖ మంత్రి तथा జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన అధికారిక వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు ఘనంగా నివాళులర్పించి, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాలాపన చేసి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అమరవీరుల త్యాగాలు, ఉద్యమకారుల పోరాట ఫలితంగానే ఆవిర్భవించిందని గుర్తు చేశారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రాన్ని సమగ్ర అభివృద్ధి, సామాజిక న్యాయం, ఆర్థిక పురోగతి దిశగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రైతుల సంక్షేమం, మహిళల సాధికారత, యువతకు ఉపాధి అవకాశాలు, విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.
జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మహిళా సంఘాల బలోపేతం కోసం జిల్లా సమాఖ్య సభ్యులకు రూ.102 కోట్ల 35 లక్షల విలువైన జంబో చెక్కును మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మహిళా సంఘాల సభ్యులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
అలాగే శంకరంపేట (ఆర్) మండలం గరిపల్లి గ్రామానికి చెందిన ఐదుగురు లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల రెండో విడత మంజూరు పత్రాలను మంత్రి పంపిణీ చేశారు. ప్రతి అర్హ కుటుంబానికి గృహ సౌకర్యం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని, మెదక్ జిల్లాలో గుడిసెలు పూర్తిగా నిర్మూలించే దిశగా చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు.
విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమాల్లో పాల్గొన్న విద్యార్థులను మంత్రి అభినందించి జ్ఞాపికలు అందజేశారు. అనంతరం వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల స్టాళ్లను సందర్శించి వాటి పనితీరును పరిశీలించారు.
కార్యక్రమం ముగింపులో తెలంగాణ అమరవీరుల కుటుంబాలను మంత్రి ఘనంగా సన్మానించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలను జిల్లా ప్రజలందరికీ తెలియజేస్తూ, రాష్ట్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రావు, అదనపు కలెక్టర్ నగేష్, మున్సిపల్ చైర్‌పర్సన్ రాధిక భూపతి రాజ్, వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్, గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్ సుహాసిని రెడ్డి, ఆర్డీవో రమాదేవి, ప్రజాప్రతినిధులు, తెలంగాణ అమరవీరుల కుటుంబ సభ్యులు, స్వాతంత్ర్య సమరయోధులు, జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.








