contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

చెరువు కబ్జా ఆరోపణలపై పవన్ కల్యాణ్ ఫైర్.. రేవంత్ ప్రభుత్వానికి సవాల్

హైదరాబాద్, జూన్ 2: తనపై వస్తున్న చెరువు కబ్జా ఆరోపణలను ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తీవ్రంగా ఖండించారు. ఆ ఆరోపణలు నిజమని నిరూపిస్తే సంబంధిత ఆస్తిని తెలంగాణ ప్రభుత్వానికే రాసి ఇస్తానని సవాల్ విసిరారు.

మంగళవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ తనపై జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. “మేము ఒక చెరువును కబ్జా చేశామంటున్నారు. నాకేం పనిలేదా? నిజంగా అలాంటి కబ్జా జరిగి ఉంటే నా ఇల్లు తగలబెట్టేసేవారు” అంటూ ఆయన ఘాటుగా స్పందించారు.

ఈ అంశాన్ని తాను నేరుగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్తున్నానని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తనకు గౌరవం, అభిమానం ఉన్నాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

“పవన్ కల్యాణ్ ఒక చెరువును ఆక్రమించుకున్నాడని ఎవరైనా నిరూపిస్తే, ఈరోజే ఆ చెరువును తెలంగాణ ప్రభుత్వానికి సంతోషంగా రాసి ఇచ్చేస్తాను” అని స్పష్టం చేశారు.

గతంలో కూడా తనను రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకు అనేక ప్రయత్నాలు జరిగాయని పవన్ కల్యాణ్ ఆరోపించారు. అయితే తప్పుడు ప్రచారాలతో తనను దెబ్బతీయాలని చేసే ప్రయత్నాలు ఫలించవని అన్నారు.

తనపై వస్తున్న ఆరోపణలకు సంబంధించి ఆధారాలు ఉంటే బహిరంగంగా బయటపెట్టాలని, లేనిపక్షంలో నిరాధార ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని పవన్ కల్యాణ్ సూచించారు.

పవన్ కల్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :