జగిత్యాల జిల్లా మెట్పల్లి మున్సిపాలిటీలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న టౌన్ ప్లానింగ్ అధికారి (టీపీఓ) రాజేంద్ర ప్రసాద్‌ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే కేసులో ఔట్సోర్సింగ్ ఉద్యోగి లింబాద్రిపై కూడా సస్పెన్షన్ వేటు పడింది.
వివరాల్లోకి వెళితే, మెట్‌పల్లికి చెందిన జగ్గుల లావణ్య అనే మహిళ తన ఇంటి నిర్మాణానికి మున్సిపాలిటీ నుంచి అనుమతులు పొంది నిర్మాణ పనులు చేపడుతోంది. ఈ క్రమంలో టౌన్ ప్లానింగ్ అధికారి రాజేంద్ర ప్రసాద్, ఔట్సోర్సింగ్ ఉద్యోగి లింబాద్రిలు స్థానిక కాలనీ వాసులతో కలిసి ఆ ఇంటి నిర్మాణంపై మున్సిపాలిటీకి ఫిర్యాదు చేయించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
అనంతరం ఇంటి నిర్మాణానికి సరైన సెట్‌బ్యాక్ లేదని, అనుమతులు సక్రమంగా లేవని పేర్కొంటూ పనులను నిలిపివేస్తామని బెదిరించి డబ్బులు డిమాండ్ చేసినట్లు బాధితురాలు ఆరోపించారు. ఈ నేపథ్యంలో లావణ్య, లింబాద్రి ఫోన్‌పే ఖాతాకు నగదు బదిలీ చేసినట్లు సమాచారం.
ఈ వ్యవహారంపై బాధితురాలు ప్రజావాణిలో ఫిర్యాదు చేయడంతో జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ విచారణకు ఆదేశించారు. విచారణలో ప్రాథమికంగా ఆరోపణలకు ఆధారాలు లభించడంతో టౌన్ ప్లానింగ్ అధికారి రాజేంద్ర ప్రసాద్‌తో పాటు ఔట్సోర్సింగ్ ఉద్యోగి లింబాద్రిలను సస్పెండ్ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ ఘటన మెట్పల్లి మున్సిపల్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రజలకు సేవలందించాల్సిన అధికారులు అవినీతి ఆరోపణలు ఎదుర్కొనడం పట్ల స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ సేవల్లో పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలని, అవినీతికి పాల్పడే వారిపై కఠిన చర్యలు కొనసాగించాలని ప్రజలు కోరుతున్నారు.








