రామాయంపేట/తూప్రాన్ : మెదక్ జిల్లా తూప్రాన్ డివిజన్ పరిధిలో విధులు నిర్వహిస్తూ ఉత్తమ సేవలు అందించిన పోలీసు సిబ్బందిని తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ అభినందించి రివార్డులతో సత్కరించారు. రామాయంపేట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయంలో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ యాదగిరి విధుల్లో చూపిన క్రమశిక్షణ, అంకితభావం, ఉత్తమ ప్రతిభకు గుర్తింపుగా ఆయనకు “ఉత్తమ పోలీస్ ఆఫీసర్” రివార్డు అందజేశారు.
అదే విధంగా తూప్రాన్ డివిజన్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తూ విశేష ప్రతిభ కనబరిచిన కానిస్టేబుళ్లు, మహిళా కానిస్టేబుళ్లు, హోంగార్డులను కూడా ఉత్తమ పోలీస్ ఆఫీసర్లుగా ఎంపిక చేసి రివార్డులు ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా డీఎస్పీ నరేందర్ గౌడ్ మాట్లాడుతూ, ప్రజలకు మరింత బాధ్యతాయుతంగా, నిబద్ధతతో సేవలందించడం ప్రతి పోలీసు సిబ్బంది విధి అని అన్నారు. విధుల్లో ప్రతిభ కనబరిచే ప్రతి ఒక్కరినీ ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ, వారి సేవలకు తగిన గుర్తింపు అందజేస్తామని తెలిపారు. ఇటువంటి ప్రోత్సాహకాలు పోలీసు సిబ్బందిలో సేవా దృక్పథాన్ని, విధి నిర్వహణలో ఉత్సాహాన్ని మరింత పెంచుతాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో తూప్రాన్ సీఐ వెంకట రాజా గౌడ్, రామాయంపేట సీఐ బి. సైదా, నర్సాపూర్ సీఐ రంగాకృష్ణ, చేగుంట ఎస్సై చైతన్య కుమార్ రెడ్డి, తూప్రాన్ డివిజన్ పరిధిలోని ఇతర పోలీస్ స్టేషన్ల ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.








