కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా, కాగజ్నగర్: సిర్పూర్ (జేకే) పేపర్ మిల్లు కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఆరో రోజుకు చేరుకున్నాయి. మిల్లు గేటు ముందు కొనసాగుతున్న ఈ దీక్షలకు కాగజ్నగర్ పట్టణ పద్మశాలి సేవా సంఘం సంపూర్ణ మద్దతు, సంఘీభావం ప్రకటించింది.
ఈ రోజు దీక్షలో గోలెం వెంకటేశం, ఏ.కే. సింగ్, రాజేష్ యాదవ్, నరేందర్ గౌడ్, రాములు, శ్రీనివాస్, సి. వెంకటేష్, పొన్న రమేష్ తదితర కార్మికులు పాల్గొన్నారు. వారికి పద్మశాలి సేవా సంఘం నాయకులు పూలమాలలు వేసి సంఘీభావం తెలియజేశారు.
ఈ సందర్భంగా పద్మశాలి సేవా సంఘం పట్టణ అధ్యక్షులు (ఎస్పీఎం INTUC కార్మిక సంఘం మాజీ జనరల్ సెక్రటరీ) గుల్లపల్లి నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి వడ్నాల వెంకన్న మాట్లాడుతూ, ఎస్పీఎం (జేకే) పేపర్ మిల్లు యాజమాన్యం, కార్మిక శాఖ అధికారులు, అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి స్థానిక కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
కార్మికుల న్యాయమైన డిమాండ్లు వెంటనే నెరవేర్చకపోతే, రాబోయే రోజుల్లో తాము కూడా కార్మికులతో కలిసి ప్రత్యక్ష ఆందోళనలో పాల్గొంటామని, దీక్షలను మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు.
ఈ సంఘీభావ కార్యక్రమంలో సంఘం కోశాధికారి కొక్కుల మురళి, ఉపాధ్యక్షులు నూతి సుదర్శన్, కొంపెల్లి సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.








