కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలంలోని ఖాసీంపేట రైతు వేదికలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. జగిత్యాల విశ్వవిద్యాలయం పొలాస నుండి విచ్చేసిన శాస్త్రవేత్తలు రవి, రామకృష్ణ మాట్లాడుతూ నేల ఆరోగ్యం పంట దిగుబడి కి కీలకమైన అంశం, కావున అధిక దిగుబడులు పొందాలంటే నేల ఆరోగ్యాన్ని కాపాడాలి అని వివరించారు. యూరియా వాడకాన్ని మరియు పురుగు మందుల వాడకాన్ని తగ్గించి జీవన ఎరువుల పై దృష్టి సారించే సమయం వచ్చిందని వివరించారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక లో భాగంగా రైతు వారోత్సవాలు మే 4 నుండి 9 వరకు జరుగుతున్నాయి, ఖాసీంపేట రైతు వేదికలో రైతు వారోత్సవాల భాగంగా ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రం బ్యాంకర్స్ తో మీటింగ్ ఏర్పాటు చేయడమైనది, ఈ కార్యక్రమానికి కేడీసీసీ బ్యాంకు మేనేజర్, సొసైటీ సీఈవో ఆంజనేయులు, సొసైటీ డైరెక్టర్లు బద్దం రామ్ రెడ్డి,బోయిని అంజయ్య, పురంశెట్టి బాలయ్య, అలువాల కోటి హాజరయ్యారు. కేడీసీసీ బ్యాంకు మేనేజర్ లోన్ వివరాలు మరియు రైతుకు అందుబాటులో ఉన్న సేవలు గురించి వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏడిఏ మానకొండూరు శ్రీధర్ హాజరై మాట్లాడారు. రైతు అవగాహన సదస్సులనూ సద్వినియోగం చేసుకొని పంట మార్పిడి,నేల ఆరోగ్యం, ప్రకృతి వ్యవసాయం మరియు ప్రభుత్వం సూచించిన సన్న రకాలను పండించి మంచి ఆదాయం పొందాలని చెప్పారు. మండల వ్యవసాయ అధికారి కిరణ్మయి మాట్లాడుతూ రైతుకు ఎల్లవేళలా సూచనలు సలహాలు అందించడానికి శాస్త్రవేత్తలు మరియు వ్యవసాయ శాఖ సిబ్బంది అందుబాటులో ఉంటుందని వివరించారు.ఖాసీంపేట గ్రామ సర్పంచ్ కర్నె చంద్రయ్య మాట్లాడుతూ రైతులు ఆయిల్ ఫామ్ పంట వైపు దృష్టి పెట్టాలని ఆయిల్ పామ్ మంచి లాభాలనిచ్చే పంట అని వివరించారు. ఈకార్యక్రమంలో ఖాసీంపేట పారువెల్ల,మైలారం రైతులు పాల్గొన్నారు.








