కరీంనగర్ జిల్లాలో ఇటీవల కురిసిన అకాల వర్షాలు, ఈదురు గాలుల కారణంగా నష్టపోయిన ప్రాంతాలను మానకొండూర్ ఎమ్మెల్యే, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎస్సీ సెల్ చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మంగళవారం సందర్శించారు. బెజ్జంకి, గన్నేరువరం మండలాల్లో పర్యటించిన ఆయన బాధిత కుటుంబాలను పరామర్శించి ప్రభుత్వపరంగా అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
అకాల వర్షాలు, ఈదురు గాలుల కారణంగా ఇండ్లు, రేకుల షెడ్లు దెబ్బతిని నిరాశ్రయులైన కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఎవరూ అధైర్యపడవద్దని, ప్రకృతి విపత్తుల వల్ల నష్టం జరిగినప్పుడు ప్రభుత్వం అండగా నిలుస్తుందని భరోసా కల్పించారు.
బెజ్జంకి మండలం కల్లేపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలపై వడగళ్ల వాన, ఈదురు గాలుల ప్రభావంతో పైకప్పు పూర్తిగా ఎగిరిపోయింది. దీంతో పాఠశాలలోని బల్లలపై ఉంచిన పుస్తకాలు, రికార్డులు పూర్తిగా తడిసి పాడయ్యాయి. ఈ ఘటనపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేస్తూ పాఠశాల హెడ్మాస్టర్తో ఫోన్లో మాట్లాడారు. విషయం తెలిసినా పాఠశాలను సందర్శించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం హైస్కూల్ భవనాన్ని పరిశీలించి పైకప్పు మరమ్మత్తులు త్వరగా చేపడతామని హామీ ఇచ్చారు.
అలాగే గ్రామంలోని బాధిత కుటుంబాలను పరామర్శించి వారికి అవసరమైన సహాయం అందిస్తామని చెప్పారు. గన్నేరువరం మండలం పారువెల్ల గ్రామంలో చెట్లు విరిగి యాళ్ల మల్లవ్వ అనే మహిళ గాయపడగా, ఎమ్మెల్యే ఆమెను పరామర్శించి వైద్య సహాయం అందించారు.
ఈ పర్యటనలో బెజ్జంకి మార్కెట్ కమిటీ చైర్మన్ పులి కృష్ణ, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు లింగాల శ్రీనివాస్, మాజీ అధ్యక్షుడు ముక్కిస రత్నాకర్ రెడ్డి, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు గూడెల్లి శ్రీకాంత్, గ్రామ పార్టీ అధ్యక్షులు ఆర్. రవీందర్, ఈ. రాజయ్య తదితరులు పాల్గొన్నారు.
ఇదిలా ఉండగా, గన్నేరువరం మండలం మాదాపూర్లోని ఐకేపీ మక్కల కొనుగోలు కేంద్రాన్ని కూడా ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ సందర్శించారు. రైతుల సమస్యలపై పై అధికారులతో మాట్లాడి మక్కలను వెంటనే కొనుగోలు చేసి గోదాములకు తరలించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.








