కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని గునుకుల కొండాపూర్ గ్రామంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. వర్షాల కారణంగా దెబ్బతిన్న ఇళ్లను, నష్టపోయిన కుటుంబాలను మంగళవారం గ్రామ సర్పంచ్ సొల్లు అజయ్ వర్మ, ఉప సర్పంచ్ న్యాలపట్ల రాజు పాలకవర్గ సభ్యులతో కలిసి సందర్శించారు.
వర్షాల కారణంగా రహదారులపై అడ్డంగా విరిగిపడ్డ చెట్లను, విద్యుత్ వైర్లను తొలగించే పనులను స్థానిక సిబ్బందితో కలిసి చేపట్టారు. గ్రామంలో పరిస్థితిని పరిశీలించిన అనంతరం నష్టపోయిన కుటుంబాలకు తక్షణ ఆర్థిక సాయం అందించాలని మండల అధికారులను కోరారు.
అలాగే వర్షాలకు తడిసిపోయిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా వెంటనే కొనుగోలు చేయాలని అధికారులకు సూచించారు. పేదల ఇళ్లకు జరిగిన నష్టాన్ని అంచనా వేసి తక్షణ నష్టపరిహారం అందించి బాధిత కుటుంబాలను ఆదుకోవాలని సర్పంచ్ సొల్లు అజయ్ వర్మ ప్రభుత్వ అధికారులను విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు పరశురాం గౌడ్, సొల్లు హరీష్, గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజేష్, ఎలక్ట్రిషన్ లింగంపల్లి అనిల్ తదితరులు పాల్గొన్నారు.








