గన్నేరువరం : భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు, గొప్ప జాతీయవాది డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలిదాన దివస్ సందర్భంగా కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో మంగళవారం బీజేపీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. బీజేపీ మండల అధ్యక్షుడు తిప్పర్తి నికేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖర్జీ చిత్రపటానికి పూలమాల వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా తిప్పర్తి నికేష్ మాట్లాడుతూ, దేశ సమైక్యత కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ అని కొనియాడారు. “ఒకే దేశంలో రెండు రాజ్యాంగాలు, రెండు ప్రధానులు, రెండు జెండాలు ఉండవు” అనే సంకల్పంతో జమ్మూ-కాశ్మీర్ సంపూర్ణ విలీనానికి ఆయన చేసిన పోరాటం భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు.
దేశ సమగ్రత, జాతీయ ఏకత్వం, భారతమాత గౌరవం కోసం ఆయన చేసిన త్యాగం ప్రతి భారతీయుడికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. 1953 జూన్ 23న దేశ సమైక్యత కోసం పోరాడుతూ ఆయన చేసిన పరమ త్యాగాన్ని భారత జాతి ఎప్పటికీ మరువదన్నారు. ఆయన ఆశయాలు, దేశభక్తి, సేవా తత్వం నేటి యువతకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయని తెలిపారు.
డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలిదాన దివస్ సందర్భంగా ఆయనకు శతకోటి వందనాలు అర్పిస్తున్నామని, ఆయన త్యాగాలు, సేవలు దేశ ప్రజలకు ఎల్లప్పుడూ స్ఫూర్తిగా నిలుస్తాయని తిప్పర్తి నికేష్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, గన్నేరువరం 8వ వార్డు సభ్యుడు మచ్చ సాయికృష్ణ, జిల్లా ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యుడు మచ్చ బాలరాజు, మండల నాయకులు సందవేణి ప్రశాంత్, అటికం రామచంద్రం, మండల ప్రధాన కార్యదర్శులు పుల్లెల రాము, బొమ్మాడి సురేందర్ రెడ్డి, కుర్ర హరీష్ తదితరులు పాల్గొన్నారు.








