contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

మెట్‌పల్లిలో సంచలనం రేపిన బిల్డర్ హత్య కేసు మిస్టరీ వీడింది

జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలో సంచలనం సృష్టించిన బిల్డర్ దాసరి రాజేంద్రప్రసాద్ అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ కార్మికుడే హత్య చేసినట్లు నిర్ధారించి అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ ఎ. రాములు వెల్లడించారు.

మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ వివరాలు వెల్లడించారు. మెట్‌పల్లి పట్టణంలోని ఆదర్శనగర్‌కు చెందిన దాసరి రాజేంద్రప్రసాద్ (55) వృత్తిరీత్యా బిల్డర్‌గా పనిచేస్తూ కొత్త ఇళ్ల నిర్మాణాలు చేపడుతూ ఉండేవారు. ఈ క్రమంలో హనుమాన్ నగర్‌లో నిర్మాణంలో ఉన్న ఇంటి వద్ద టైల్స్, పెయింటింగ్ పనుల కోసం ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన గౌతమ్ కుమార్ అనే కార్మికుడిని నియమించుకున్నారు.

గత శనివారం రాత్రి నిర్మాణ స్థలంలోని కాంపౌండ్‌లో రాజేంద్రప్రసాద్ తలకు తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో మృతిచెందిన స్థితిలో కనిపించడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి భార్య దాసరి యశోద ఫిర్యాదు మేరకు మెట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో మొదట అనుమానాస్పద మృతి కేసుగా ఎఫ్‌ఐఆర్ నంబర్ 213/2026 నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

సంఘటన స్థల పరిశీలన, మృతదేహంపై ఉన్న గాయాలు, మెడలో ఉన్న బంగారు చైన్ కనిపించకపోవడం, కుటుంబ సభ్యులు, సాక్షుల వాంగ్మూలాలు, సాంకేతిక ఆధారాలను పరిశీలించిన పోలీసులు ఇది హత్య అని నిర్ధారించారు. అనంతరం కేసును హత్య కేసుగా మార్చి విచారణ చేపట్టగా, మృతుడి వద్ద పనిచేస్తున్న గౌతమ్ కుమార్‌పై అనుమానం వ్యక్తమైంది.

పోలీసుల విచారణలో గౌతమ్ కుమార్ (23), ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గోరఖ్‌పూర్ జిల్లా బంస్గావ్ మండలంలోని బర్దిహ్ గ్రామానికి చెందిన వ్యక్తి, నేరాన్ని అంగీకరించినట్లు తెలిపారు. జీవనోపాధి కోసం కొద్ది రోజుల క్రితం మెట్‌పల్లికి వచ్చిన అతను నిర్మాణ పనుల్లో టైల్స్, పెయింటింగ్ పనులు చేస్తూ జీవిస్తున్నాడు.

తనకు వచ్చే కూలీ సరిపోవడం లేదని భావించిన నిందితుడు సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో రాజేంద్రప్రసాద్ మెడలో ఉన్న బంగారు చైన్, ఉంగరాన్ని దోచుకోవాలని పథకం రచించినట్లు పోలీసులు తెలిపారు. అలాగే పనిని సక్రమంగా చేయడం లేదని రాజేంద్రప్రసాద్ పలుమార్లు మందలించడంతో అతనిపై వ్యక్తిగత కక్ష కూడా పెంచుకున్నాడు.

ఈ నేపథ్యంలో సంఘటనకు ముందు ఒక గొడ్డలిని కొనుగోలు చేసి సిద్ధంగా ఉంచుకున్న గౌతమ్ కుమార్, శనివారం రాత్రి నిర్మాణ స్థలం వద్ద జరిగిన వాగ్వాదం అనంతరం గొడ్డలితో రాజేంద్రప్రసాద్ తలపై బలంగా దాడి చేసి హత్య చేసినట్లు వెల్లడైంది. అనంతరం మృతుడి మెడలో ఉన్న బంగారు చైన్ తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు.

హత్య అనంతరం నేరానికి ఉపయోగించిన గొడ్డలిని పెయింట్ బకెట్‌లో పెట్టి ఆదర్శనగర్‌లోని మృతుడి నివాసం వద్ద మెట్ల కింద దాచిపెట్టినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడి వద్ద నుంచి 7.25 గ్రాముల బంగారు చైన్, ఐటెల్ స్మార్ట్‌ఫోన్, హీరో హోండా స్ప్లెండర్ బైక్, ఇనుప గొడ్డలి, పెయింట్ బకెట్‌ను స్వాధీనం చేసుకున్నారు.

నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా, మెట్‌పల్లి మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు జగిత్యాల జైలుకు తరలించినట్లు డీఎస్పీ ఎ. రాములు తెలిపారు. ఈ కేసును వేగంగా ఛేదించిన పోలీసు బృందాన్ని ఆయన అభినందించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :