భారత్ లో వచ్చే పదేళ్ల కాలంలో పెద్ద ఎత్తున వైద్య నిపుణులు అందుబాటులోకి వస్తారని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ప్రతి జిల్లాకు ఒక వైద్య కళాశాల ఏర్పాటు చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తున్నట్టు చెప్పారు. గుజరాత్ లోని భుజ్ జిల్లాలో ఏర్పాటు చేసిన కేకే పటేల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రధాని శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ రూపంలో ప్రారంభించి మాట్లాడారు.
వైద్య విద్యను ప్రతి ఒక్కరికి చేరువ చేసేందుకు కృషి చేస్తున్నట్టు ప్రధాని చెప్పారు. ఈ చర్యల ఫలితంగా రానున్న పదేళ్లలో భారీగా వైద్యులు సమకూరతారని తెలిపారు. అందుబాటు ధరలకే నాణ్యమైన వైద్యాన్ని భుజ్ ఆస్పత్రి అందించాలని సూచించారు.
‘‘20 ఏళ్ల కిందట గుజరాత్ లో 9 వైద్య కళాశాలలే ఉన్నాయి. వాటిలోని సీట్లు 1,100. నేడు 36 కళాశాలలు, 6,000 సీట్లకు పెరిగాయి’’ అని ప్రధాని వివరించారు. 2001లో తీవ్ర భూకంపాన్ని తట్టుకుని నిలబడినట్టు గుర్తు చేశారు. వ్యాధులకే కాదని, సామాజిక న్యాయానికీ చికిత్స అవసరమని ప్రధాని వ్యాఖ్యానించారు. పేదలు సైతం చౌకగా, చక్కటి వైద్యాన్ని పొందినప్పుడు వ్యవస్థపై వారికి నమ్మకం కలుగుతుందన్నారు.