contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

గొర్రెలు కాయడానికి ఉద్యోగ ప్రకటన .. 700 మందికి పైగా దరఖాస్తు

చైనాలోని మంగోలియా సరిహద్దు ప్రాంతంలో గొర్రెల కాపరుల కోసం ఇచ్చిన ఓ సాధారణ ఉద్యోగ ప్రకటన సామాజిక మాధ్యమాల్లో సంచలనంగా మారింది. మారుమూల గడ్డి మైదానాల్లో పనిచేయడానికి ఇద్దరు గొర్రెల కాపరులు కావాలని వ్యవసాయ క్షేత్ర యజమాని జువో జియావోయాంగ్ ఇచ్చిన ప్రకటనకు ఊహించని స్థాయిలో స్పందన లభించింది.

ఈ పోస్టు కొన్ని గంటల్లోనే చైనా ప్రముఖ సోషల్ మీడియా వేదిక ‘వీబో’లో ట్రెండింగ్‌లో మొదటి స్థానానికి చేరుకుంది. దాదాపు 5.9 కోట్ల మంది ఈ ప్రకటనను వీక్షించగా, రెండు పోస్టుల కోసం 700 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. షాంఘై, చోంగ్‌కింగ్ వంటి మహానగరాల్లో పనిచేస్తున్న వైట్ కాలర్ ఉద్యోగులతో పాటు ఫ్యాక్టరీ కార్మికులు, విశ్వవిద్యాలయ పట్టభద్రులు కూడా ఈ ఉద్యోగంపై ఆసక్తి చూపడం విశేషం.

ఈ ఉద్యోగానికి నెలకు సుమారు రూ.1.10 లక్షల వేతనం ప్రకటించగా, ఇది చైనాలోని అనేక ప్రైవేటు కంపెనీల సగటు జీతం కంటే ఎక్కువగా ఉండటం ఆకర్షణగా మారింది. అంతేకాకుండా ఉచిత వసతి, ఉచిత గ్రాసరీ సదుపాయాలు కూడా కల్పిస్తామని ప్రకటనలో పేర్కొన్నారు.

అయితే ఈ పని అంత సులభం కాదు. వేసవిలో దాదాపు 4,900 ఎకరాల విస్తీర్ణంలో 3,000 గొర్రెలను మేపాల్సి ఉంటుంది. శీతాకాలంలో మైనస్ 30 డిగ్రీల తీవ్ర చలిలో వాటిని సంరక్షిస్తూ అక్కడే నివసించాలి. ఏడాది పొడవునా మనుషుల రాకపోకలు లేకుండా ఒంటరిగా జీవించాల్సి రావడం కూడా ఈ ఉద్యోగంలో ప్రధాన సవాలుగా చెప్పవచ్చు.

తన ప్రకటన ఇంత వైరల్ అవుతుందని ఊహించలేదని జువో తెలిపారు. దరఖాస్తు చేసుకున్న వారిలో పదోవంతు మంది తాజాగా విశ్వవిద్యాలయ విద్య పూర్తి చేసిన యువతేనని, మరికొందరు అప్పుల భారంతో ఉద్యోగాన్వేషణలో ఉన్నారని చెప్పారు. చైనాలో ప్రస్తుత ఉద్యోగ మార్కెట్ పరిస్థితులు ఎంత క్లిష్టంగా ఉన్నాయో ఈ స్పందన స్పష్టం చేస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అయితే చివరకు జువో నగర జీవనానికి అలవాటు పడిన యువతను కాకుండా, వ్యవసాయ రంగంలో అనుభవం ఉన్న, ఒంటరితనాన్ని తట్టుకోగల 1980లలో జన్మించిన రెండు జంటలను ఎంపిక చేసినట్లు వెల్లడించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :