తిరుపతి జిల్లా, పాకాల : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేష్ మరియు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావుల పిలుపు మేరకు ‘మహానాడు’ పండుగ వర్చువల్ విధానంలో అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ఇందులో భాగంగా చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే పులివర్తి నాని ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని 12 క్లస్టర్లలో మహానాడు వేడుకలను శ్రేణులు పండుగ వాతావరణంలో ప్రారంభించాయి.
ఎన్టీఆర్ చిత్రపటానికి ఘన నివాళి:
పాకాల మండలంలో నిర్వహించిన మహానాడు కార్యక్రమానికి ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి, ప్రముఖ సామాజిక కార్యకర్త పులివర్తి సుధారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కార్యక్రమ ప్రారంభానికి ముందు ఆమె పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం తెలుగుజాతి గర్వించదగ్గ నాయకుడు, టీడీపీ వ్యవస్థాపకులు, కీర్తిశేషులు స్వర్గీయ నందమూరి తారకరామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
హైబ్రీడ్ పద్ధతిలో మహానాడు:
ఈ సందర్భంగా పులివర్తి సుధారెడ్డి మాట్లాడుతూ.. ప్రతి ఏటా తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడును, ఈ సంవత్సరం అధినేత నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబుల ఆదేశాల మేరకు సరికొత్తగా ‘హైబ్రీడ్’ పద్ధతిలో క్లస్టర్ల వారీగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ విధానం వల్ల క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులంతా ఉత్సాహంగా భాగస్వాములు అవుతున్నారని హర్షం వ్యక్తం చేశారు. పాకాల మండలంలో క్లస్టర్ల వారీగా జరిగిన ఈ వేడుకకు విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరినీ ఆమె పేరుపేరునా ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
కార్యకర్తలకు కృతజ్ఞతలు – తీర్మానాల అమలుకు హామీ:
గత సార్వత్రిక ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ చారిత్రాత్మక విజయం సాధించడం వెనుక ప్రతి ఒక్క కార్యకర్త, నాయకుడి కష్టం ఉందన్నారు. నియోజకవర్గంలో కూటమి గెలుపు కోసం అహర్నిశలు శ్రమించిన ప్రతి ఒక్కరికీ ఆమె పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే, పాకాల మండలంలోని క్లస్టర్ల వారీగా మహానాడు వేదికలపై పార్టీ శ్రేణులు ప్రవేశపెట్టిన ప్రజాకూల తీర్మానాలన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, అవి ఖచ్చితంగా అమలు అయ్యేలా ఎమ్మెల్యే పులివర్తి నాని నేతృత్వంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటామని సుధారెడ్డి స్పష్టమైన హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో పాకాల మండల తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, క్లస్టర్ ఇన్‌చార్జులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు.








