చెన్నై : తమిళనాడు రాజకీయాల్లో రాజ్యసభ ఉపఎన్నిక వేడి రాజుకుంది. ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానానికి త్వరలో ఉపఎన్నిక జరగనున్న నేపథ్యంలో సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరం మంగళవారం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి, టీవీకే అధినేత విజయ్‌తో సమావేశమయ్యారు. ఈ భేటీ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.
సమావేశంలో రాజ్యసభ ఉపఎన్నిక అంశంపై చర్చ జరిగినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కొత్తగా అధికారంలోకి వచ్చిన టీవీకే ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ బయట నుంచి మద్దతు ఇస్తున్న నేపథ్యంలో, ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానాన్ని కాంగ్రెస్‌కు కేటాయించాలని ఆ పార్టీ అధిష్ఠానం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
ప్రస్తుతం తమిళనాడు అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ నేపథ్యంలో తమ పార్టీ అభ్యర్థికి అధికార కూటమి మద్దతు ఇవ్వాలని పి. చిదంబరం ముఖ్యమంత్రి విజయ్ను కోరినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ హైకమాండ్ సూచనల మేరకే ఆయన ఈ భేటీ నిర్వహించినట్లు సమాచారం.
ఉపఎన్నికకు కారణం ఇదే
గతంలో ఏఐఏడీఎంకే తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఉన్న షణ్ముగం ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మైలం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. దీంతో ఆయన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఆ స్థానం ఖాళీ అయింది. ఈ స్థానాన్ని భర్తీ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల చేసింది.
ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్న సంఖ్యాబలం ప్రకారం ఈ స్థానాన్ని గెలుచుకునే పూర్తి అవకాశం అధికార టీవీకే కూటమికే ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
విజయ్ నిర్ణయంపై ఉత్కంఠ
తమిళనాడు అసెంబ్లీలో టీవీకే పార్టీకి సొంతంగా 107 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మిత్రపక్షాల మద్దతు కూడా ఉండటంతో ఆ పార్టీ అభ్యర్థి సులభంగా గెలిచే పరిస్థితి నెలకొంది. అయితే ఈ స్థానాన్ని కాంగ్రెస్‌కు కేటాయించాలా లేదా టీవీకే అభ్యర్థినే బరిలోకి దించాలా అన్న అంశంపై ముఖ్యమంత్రి విజయ్ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.
ఈ విషయంపై పార్టీ సీనియర్ నాయకులు, కూటమిలోని భాగస్వామ్య పక్షాలతో చర్చించిన అనంతరం నిర్ణయం ప్రకటిస్తామని విజయ్ పేర్కొన్నట్లు సమాచారం. దీంతో రాజ్యసభ ఉపఎన్నికలో అధికార కూటమి వ్యూహం ఎలా ఉండబోతోందన్న దానిపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.








