contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

తిరుపతిలో జాతీయ శాసనాల మ్యూజియంకు మార్గం సుగమం

తిరుపతి: భారతదేశపు గొప్ప శాసన వారసత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేసే ప్రతిష్ఠాత్మక జాతీయ శాసనాల మ్యూజియం (నేషనల్ మ్యూజియం ఆఫ్ ఎపిగ్రఫీ) ఏర్పాటుకు తిరుపతిలో మార్గం సుగమమైంది. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్మించనున్న ఈ మ్యూజియం కోసం రెండు ఎకరాల భూమిని కేటాయించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సూత్రప్రాయంగా అంగీకరించింది.

ఇటీవల టీటీడీ ఈవో ఎం. రవిచంద్ర, ఛైర్మన్ బి.ఆర్. నాయుడు, కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, శాఖ కార్యదర్శి వివేక్, భారత పురావస్తు సర్వే (ఏఎస్ఐ) డైరెక్టర్ జనరల్ యదువీర్ సింగ్‌ల మధ్య జరిగిన కీలక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దేశ చరిత్రను శాసనాల రూపంలో భద్రపరిచిన అపారమైన వారసత్వాన్ని పరిరక్షించడం, పరిశోధనలకు ప్రోత్సాహం కల్పించడం ఈ మ్యూజియం ప్రధాన లక్ష్యంగా ఉండనుంది.

ఏఎస్ఐ ఎపిగ్రఫీ డైరెక్టర్ కె. మునిరత్నం రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, మ్యూజియంలో అరుదైన శిలాశాసనాలు, రాగి ఫలక శాసనాలు, పురాతన భారత చరిత్రను ప్రతిబింబించే ఫోటో మ్యూరల్స్, ఆధునిక ఇంటరాక్టివ్ కియోస్క్‌లను ఏర్పాటు చేయనున్నారు. బ్రాహ్మి, ఖరోష్ఠి వంటి ప్రాచీన లిపులతో పాటు శారద, టంక్రి, గుప్త, శంఖలిపి వంటి ప్రాంతీయ లిపుల ప్రత్యేక ప్రదర్శనలు కూడా ఉండనున్నాయి.

క్రీస్తుపూర్వం 2500 కాలం నుంచి 17వ శతాబ్దం వరకు చెందిన అసలైన శాసనాలను మ్యూజియంలో ప్రదర్శించనున్నారు. ఈ శాసనాల ద్వారా వివిధ రాజవంశాల చరిత్ర, పరిపాలనా విధానాలు, సామాజిక-ఆర్థిక పరిస్థితులు, సాంస్కృతిక పరిణామాలను విద్యార్థులు, పరిశోధకులు లోతుగా అధ్యయనం చేసే అవకాశం కలుగుతుంది.

తిరుమలకు వచ్చే లక్షలాది మంది యాత్రికులకు ఈ మ్యూజియం ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి పేర్కొన్నారు. ఆధ్యాత్మికతతో పాటు భారతీయ చరిత్ర, సంస్కృతి, లిపి సంపదను ఒకే వేదికపై పరిచయం చేసే కేంద్రంగా ఈ మ్యూజియం రూపుదిద్దుకోనుందని ఆయన అభిప్రాయపడ్డారు.

జాతీయ స్థాయిలో ఏర్పాటు కానున్న ఈ మ్యూజియం తిరుపతిని ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా, చారిత్రక-సాంస్కృతిక పరిశోధనలకు ముఖ్య కేంద్రంగా నిలబెట్టనుందని భావిస్తున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :