కరీంనగర్ జిల్లా : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోయే జిల్లాలు, మండలాల పునర్విభజనతో పాటు జోన్లను కూడా పునర్విభజించాల్సిన అవసరం ఉందని తెలంగాణ సీపీఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హన్మండ్ల భాస్కర్ డిమాండ్ చేశారు. బుధవారం గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ, గతంలో ప్రకటించిన జోన్లు పూర్తిగా అస్తవ్యస్తంగా ఉన్నాయని విమర్శించారు. జోన్ల ప్రకటన శాస్త్రీయంగా లేకపోవడం వల్ల ఉద్యోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రస్తుత జోన్లను పునర్వ్యవస్థీకరించి ఉమ్మడి జిల్లాల ఆధారంగా జోన్లను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.
ఉమ్మడి జిల్లాలను జోన్లుగా ప్రకటించి, ఆయా జోన్ల పరిధిలో బదిలీలు చేపడితే ఉద్యోగులకు పెనుబండారంగా మారిన 317 జీవోతో పాటు స్పౌస్ ఉద్యోగుల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని భాస్కర్ తెలిపారు. ఉమ్మడి జిల్లాల జోన్లు శాస్త్రీయంగా ఉండటంతో ఉద్యోగులు, నిరుద్యోగులకు కూడా ఎంతో వెసులుబాటు కలుగుతుందని అన్నారు.
కావున రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోన్ల పునర్విభజనపై నిర్ణయం తీసుకుని ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ఆయన కోరారు.









