మెదక్ జిల్లా తూప్రాన్ డివిజన్ పరిధిలోని చేగుంట మండలం కేంద్రంలో బుధవారం రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. చేగుంట గ్రామంలోని మకరాజుపేట రోడ్డులో ఉన్న హెచ్పి పెట్రోల్ బంక్ వద్ద ఈ కార్యక్రమం జరిగింది.
తూప్రాన్ డిఎస్పి నరేందర్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రోడ్డు భద్రత నిబంధనలు, ట్రాఫిక్ నియమాల ప్రాముఖ్యత, హెల్మెట్ ధరించడం, సీటుబెల్ట్ వినియోగం, మద్యం సేవించి వాహనం నడపకూడదనే అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని డిఎస్పి సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఐ బిక్యా నాయక్ మరియు చేగుంట పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. స్థానిక ప్రజలు, వాహనదారులు కూడా పెద్ద సంఖ్యలో హాజరై రోడ్డు భద్రతపై అవగాహన పొందారు.
రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా ఇలాంటి కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించి ప్రజల్లో చైతన్యం కల్పిస్తామని పోలీసులు తెలిపారు.








