- ఇంటర్ పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తు
- మెదక్ జిల్లా ఎస్పీ డి. వి. శ్రీనివాస రావు
మెదక్/ తూప్రాన్ డివిజన్: బుధవారం ప్రారంభమైన ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల సందర్భంగా మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు వివిధ పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పరీక్షల నిర్వహణ తీరును, భద్రతా ఏర్పాట్లను ఆయన సమీక్షించారు. విద్యార్థులు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసెందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తును పటిష్టంగా ఏర్పాటు చేశామని తెలిపారు. అనవసర గుంపులు ఏర్పడకుండా చూడాలని సెల్ఫోన్లు తదితర ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించవద్దని ఆదేశించారు. విద్యార్థులకు తాగునీరు వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఎస్పీ ఆదేశించారు. ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు సజావుగా ప్రశాంతంగా పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తోందని తెలిపారు. ప్రశ్నపత్రాల రవాణా సమయంలోనూ పరీక్షలు ముగిసిన అనంతరం జవాబు పత్రాలను పూర్తిస్థాయి పోలీస్ బందోబస్తుతో సురక్షితంగా తరలించాలని సూచించారు.








