మెదక్ జిల్లా, తూప్రాన్ డివిజన్: మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ దొడ్డి కొమురయ్య పోరాట స్ఫూర్తి ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.
శుక్రవారం సమీకృత జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన దొడ్డి కొమురయ్య 99వ జయంతి కార్యక్రమంలో కలెక్టర్ ప్రతిమా సింగ్ పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, వెనుకబడిన తరగతుల సహాయ అభివృద్ధి అధికారి శ్రీనివాస్, సంఘ నాయకులు యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, దొడ్డి కొమురయ్య తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించిన మహానుభావుడని అన్నారు. అణచివేతలకు వ్యతిరేకంగా ప్రజల హక్కుల కోసం ప్రాణత్యాగం చేసిన తొలి అమరుడిగా ఆయన చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని తెలిపారు.
కొమురయ్య చూపిన ధైర్యం, త్యాగం, పోరాట స్ఫూర్తి నేటి యువతకు మార్గదర్శకమని ఆమె పేర్కొన్నారు. ప్రజల హక్కులు, సమానత్వం కోసం ఆయన చేసిన త్యాగాలను స్మరించుకుంటూ, ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టడం ద్వారానే నిజమైన నివాళి అర్పించినవారమవుతామని అన్నారు.
సమాజంలో న్యాయం, సమానత్వం నెలకొల్పేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. మహనీయులను కులం, వర్గం అనే పరిమితుల్లో చూడకుండా వారి ఆశయాలను ఆదర్శంగా తీసుకొని సమాజ అభివృద్ధికి అందరూ కృషి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో బీ.సీ సంఘాల ప్రతినిధులు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.








