జగిత్యాల జిల్లా, మెట్పల్లి: తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఆర్టిజన్ ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. గత నాలుగు రోజులుగా కొనసాగుతున్న ఈ ఆందోళనలో భాగంగా, సోమవారం మెట్పల్లి డివిజనల్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) కార్యాలయం ఎదుట వంటవార్పు కార్యక్రమం నిర్వహించి తమ నిరసనను తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆర్టిజన్ ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆర్టిజన్ ఉద్యోగులతో పాటు బిల్ కలెక్టర్లు, స్పాట్ బిల్లర్లు, ఆన్మ్యాన్డ్ కార్మికులు కూడా సమ్మెలో పాల్గొన్నారు. జగిత్యాల జిల్లాలోని సుమారు 360 మంది ఆర్టిజన్ ఉద్యోగులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనడం గమనార్హం.
ఈ సందర్భంగా జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ, తాము గత 20 సంవత్సరాలుగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ విధులు నిర్వర్తిస్తున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తమ జీవన పరిస్థితులు మెరుగుపడతాయని ఆశించినప్పటికీ, ఇప్పటికీ నిరాశే మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ డిమాండ్లు ప్రభుత్వం మీద ఎలాంటి ఆర్థిక భారం మోపని సాధారణ కోరికలేనని పేర్కొన్నారు.
తమ ప్రధాన డిమాండ్లలో భాగంగా ఆర్టిజన్ కార్మికులకు విద్యార్హతల ఆధారంగా కన్వర్షన్ కల్పించాలని, TGSPDCL మరియు TGNPDCL పరిధిలో పని చేస్తున్న అన్మ్యాన్డ్ కార్మికులను ఆర్టిజన్లుగా గుర్తించాలని కోరారు. అలాగే 04-12-2016 నాటికి అన్ని అర్హతలు ఉన్నప్పటికీ విలీనం కాని కార్మికులను ఆర్టిజన్లుగా గుర్తించాలన్నారు. పీస్ రేట్ కార్మికులకు జి.ఓ. నెం.11 ప్రకారం కనీస వేతన చట్టాన్ని అమలు చేసి, నెలకు 30 రోజుల పనిదినాలను కల్పించాలని డిమాండ్ చేశారు.
ఇదే విధంగా ఆర్టిజన్ కార్మికులకు AAPSEB నిబంధనలు వర్తింపజేయాలని, రాష్ట్రంలో ఒకే సంస్థ – ఒకే రూల్స్ విధానం అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం మరియు విద్యుత్ సంస్థలు తక్షణం చర్చలు జరిపి తమ సమస్యలను పరిష్కరించాలని, న్యాయం జరిగే వరకు తమ ఆందోళనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.








