contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

చిగురుమామిడి లో మంత్రి పొన్నం పర్యటన..

కరీంనగర్ జిల్లా, హుస్నాబాద్: చిగురుమామిడి మండల కేంద్రంలో ఆదివారం పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ తెలంగాణ పబ్లిక్ స్కూల్ స్థలాన్ని పరిశీలించి, అనంతరం రైతులకు అధునాతన వ్యవసాయ పనిముట్లను పంపిణీ చేశారు.

మండలంలోని ఉన్నత పాఠశాల ప్రాంగణంలో 4 ఎకరాల విస్తీర్ణంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్న నేపథ్యంలో మంత్రి స్వయంగా స్థలాన్ని పరిశీలించారు. ఈ పాఠశాలలో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యను అందించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. అదే ప్రాంగణంలో ప్రాథమిక పాఠశాల, హైస్కూల్, జూనియర్ కాలేజీ ఏర్పాటు చేసేలా అధికారులకు పలు సూచనలు చేశారు.

అనంతరం చిగురుమామిడి రైతు వేదిక వద్ద వ్యవసాయ యాంత్రీకరణ పథకం (SMAM 2025-26) కింద 24 మంది రైతులకు రూ.40.80 లక్షల విలువైన ఆధునిక వ్యవసాయ పనిముట్లను మంత్రి పంపిణీ చేశారు. ఇందులో 15 రోటావేటర్లు, బెయిలర్లు, పవర్ స్ప్రేయర్లు తదితర పరికరాలు ఉన్నాయి.

ఈ సందర్భంగా లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చెక్కులను కూడా అందజేశారు.

మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, “చాలా సంవత్సరాల తర్వాత ప్రజా ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ తరపున ఈ విధంగా పనిముట్ల పంపిణీ జరుగుతోంది. ఇంకా అవసరం ఉన్న రైతులు దరఖాస్తు చేసుకోవాలి. గడ్డి మోపులు కట్టే బెయిలర్లకు ఎక్కువ డిమాండ్ ఉందని తెలుస్తోంది. రైతులు అవసరాలకు అనుగుణంగా వినియోగించుకోవాలి” అని తెలిపారు.

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఇప్పటికే ప్రారంభించామని, ఎక్కడా ఇబ్బందులు లేవని మంత్రి పేర్కొన్నారు. ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహిస్తూ, 5 ఎకరాలకు పైగా భూమి ఉన్న రైతులు ఆయిల్ ఫామ్ సాగు చేయాలని సూచించారు. చిన్న గ్రామాల్లో 50 ఎకరాలు, పెద్ద గ్రామాల్లో 100 ఎకరాల మేర సాగు చేయాలని సూచించారు. ఆయిల్ ఫామ్ సాగుతో ప్రకృతి మరియు కోతుల ఇబ్బందులు తగ్గుతాయని తెలిపారు.

సాగునీటి కాలువల పనులు త్వరలో పూర్తవుతాయని, గౌరవెల్లి ప్రాజెక్ట్‌పై ఇటీవల సమావేశం జరిగిందని, పెండింగ్ చెల్లింపులను కూడా త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పారు. కాలువల నిర్మాణానికి రైతులు భూములు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

చిగురుమామిడి మండల కేంద్రంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ కోసం 4 ఎకరాల స్థలాన్ని గుర్తించామని, కళ్యాణ లక్ష్మి చెక్కులు ఆలస్యం లేకుండా అందజేస్తున్నామని మంత్రి తెలిపారు. రేకొండ భూ సమస్యపై ముఖ్యమంత్రిని కలిసి చర్చించామని వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అశ్వినీ తానాజీ వాకడే, సర్పంచ్ ఆకవరం భవాని, హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, ఆర్డీవో మహేష్, ఎమ్మార్వోతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :