అనంతపురం జిల్లా గుత్తి పట్టణానికి చెందిన విద్యార్థి తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. గుత్తి పట్టణంలోని బీసీ కాలనీలో నివాసం ఉంటున్న మీసేవ నిర్వాహకుడు టి. సురేష్, అరుణ దంపతుల కుమారుడు సుజిత్ ఈ ఘనత సాధించాడు.
ప్రస్తుతం హైదరాబాద్లోని ఇగ్నైట్ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న సుజిత్, ఆదివారం విడుదలైన తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల్లో 1000 మార్కులకు గాను 989 మార్కులు సాధించి ప్రతిభ చాటాడు.
సుజిత్ తన విద్యాభ్యాసాన్ని గుత్తి పట్టణంలోనే ప్రారంభించాడు. మొదటి తరగతి నుండి 8వ తరగతి వరకు శ్రీ మేధా పాఠశాలలో చదివి, 9వ తరగతి నుండి పదవ తరగతి వరకు మహర్షి దయానంద గురుకులం పాఠశాలలో విద్యను అభ్యసించాడు. పాఠశాల స్థాయి నుంచే అతను మెరుగైన ప్రతిభ కనబరిచినట్లు గురువులు తెలిపారు.
సుజిత్ సాధించిన ఈ విజయం పట్ల అతని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేయగా, పాఠశాల ఉపాధ్యాయులు, స్నేహితులు, పట్టణవాసులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేశారు. అతని భవిష్యత్తులో మరిన్ని ఉన్నత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.








