పార్వతీపురం : రాష్ట్ర విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయని, కార్పొరేట్ సంస్థలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధిస్తున్నారని రాష్ట్ర గిరిజన సంక్షేమ, మహిళా శిశు సంక్షేమ శాఖామాత్యులు గుమ్మిడి సంధ్యారాణి ఆనందాన్ని వ్యక్తం చేశారు.
మంగళవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని మన్యం కళా వేదికలో 2026వ సంవత్సరంలో 10వ తరగతి టాపర్స్ కు నిర్వహించిన జిల్లా స్థాయి సన్మాన కార్యక్రమం జిల్లా కలెక్టర్ కలెక్టర్ డా:ఎన్.ప్రభాకర రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్బంగా మంత్రివర్యులు మాట్లాడుతూ వరుసగా నాలుగోసారి పార్వతీపురం మన్యం జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచి రికార్డు సృష్టించిందన్నారు. ఈ జిల్లా నుండి సుమారు 10,500 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, అందులో 9,000 మంది విద్యార్థులు ఫస్ట్ క్లాస్‌లో ఉత్తీర్ణత సాధించడం విశేషమని అన్నారు. అంతే కాకుండా, సుమారు 500 మంది విద్యార్థులు 590 పైగా మార్కులు సాధించి జిల్లా గర్వపడేలా చేశారని గుర్తుచేశారు.
విద్యా శాఖ ‘100 డేస్ ప్లాన్ సక్సెస్.
రాష్ట్ర విద్యాశాఖా మంత్రి నారా లోకేష్ ప్రవేశపెట్టిన ‘100 రోజుల ప్రణాళిక’ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు వరంగా మారిందన్నారు. ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేసి ఈ ప్రణాళికను అమలు చేయడం వల్లే ఈ అద్భుత విజయాలు సాధ్యమయ్యాయని పేర్కొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో మారిన రూపురేఖలు.
రాజముద్రతో కూడిన పుస్తకాలు, యూనిఫాంలు, నాణ్యమైన షూస్, బెల్టులు మరియు బ్యాగుల పంపిణీ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపిందన్నారు. చరిత్రలో మొదటిసారిగా కార్పొరేట్ విద్యాసంస్థల ప్రకటనల కంటే మిన్నగా, ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల విజయ గాథలు పత్రికల మొదటి పేజీల్లో నిలవడం విశేషమని తెలిపారు. మార్కుల కోసం పిల్లలను ఇతరులతో పోల్చి ఒత్తిడికి గురిచేయవద్దని, అది వారిని ఆత్మహత్యల వంటి అఘాయిత్యాలకు ప్రేరేపిస్తుందని హెచ్చరించారు.
విద్యార్థులు గంజాయి, డ్రగ్స్ వంటి సామాజిక రుగ్మతలకు మరియు క్రికెట్ బెట్టింగ్‌లకు దూరంగా ఉండి, క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి లోకేష్ నాయకత్వంలో ప్రభుత్వ విద్యారంగం సరికొత్త పుంతలు తొక్కుతోందని ఈ సందర్భంగా మంత్రి అన్నారు.
100 రోజుల ప్రణాళిక వల్ల ఉపాధ్యాయులపై పని ఒత్తిడి పెరిగినప్పటికీ, వారు విద్యార్థుల భవిష్యత్తు కోసం అంకితభావంతో పనిచేశారని పలువురు పేర్కొన్నారు. టీచర్లు రాత్రి సమయాల్లో కూడా విధులు నిర్వహిస్తూ, విద్యార్థుల సందేహాలను నివృత్తి చేయడం వల్ల ఈ విజయం సాధ్యమైందని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని మాత్రమే ఉపాధ్యాయులను కోరామని, వారు దానిని అద్భుతంగా నిర్వర్తించారని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఉత్తమ ఫలితాల్లో అమ్మాయిలదే హవా – కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా.
ఈ ఫలితాల్లో అబ్బాయిల కంటే అమ్మాయిలే పైచేయి సాధించి, తాము దేనిలోనూ తక్కువ కాదని నిరూపించుకున్నారన్నారు. విద్యా నాణ్యతలో ప్రభుత్వ సంస్థలు ప్రైవేట్ స్కూళ్లను వెనక్కి నెట్టడం విశేషమని అన్నారు. అంతర్జాతీయ ప్రమాణాల దిశగా విద్యా వ్యవస్థను అభివృద్ధి పరచడం కోసం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ ఉపాధ్యాయులను సింగపూర్ పర్యటనకు పంపడం ద్వారా అక్కడి విద్యా విధానాలను మన పాఠశాలల్లో అమలు చేసేందుకు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. విద్యార్థులు కేవలం ఉద్యోగాల కోసమే కాకుండా, సంస్కారం మరియు విజ్ఞానం కోసం చదవాలని, తాము ఏ వృత్తిలో ఉన్నా చదువుకున్న జ్ఞానాన్ని ఉపయోగించాలని పిలుపునిచ్చారు. చివరగా, విద్యార్థుల ఎదుగుదలకు నిచ్చెనలా తోడ్పడిన ఉపాధ్యాయులను ఎన్నటికీ మర్చిపోవద్దని, వారి పట్ల గౌరవంతో మెలగాలని విద్యార్థులకు సూచించారు.
జిల్లా కలెక్టర్ డా:ఎన్. ప్రభాకర రెడ్ది మాట్లాడుతూ పదో తరగతి ఫలితాల్లో పార్వతీపురం మన్యం జిల్లా మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుందన్నారు. వరుసగా నాలుగో సంవత్సరం కూడా రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుని ‘డబుల్ హ్యాట్రిక్’ దిశగా అడుగులు వేస్తోందన్నారు. ఈ విజయోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా యంత్రాంగం మరియు ప్రజా ప్రతినిధులు విద్యార్థులను, ఉపాధ్యాయులను ఘనంగా అభినందించారు.
విజయకేతనం ఎగురవేసిన గణాంకాలు.
రాష్ట్రంలోనే ప్రథమ స్థానం: మన్యం జిల్లా వరుసగా నాలుగో ఏడాది కూడా రాష్ట్రంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది సుమారు 10,500 మంది విద్యార్థులు పరీక్ష రాయగా, అందులో 9,000 మందికి పైగా విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణత సాధించిన వారిలో 95 శాతం మంది విద్యార్థులు ఫస్ట్ క్లాస్‌లో పాస్ అవ్వడం గమనార్హం. జిల్లాలోని 52 శాతం పాఠశాలలు నూటికి నూరు శాతం ఉత్తీర్ణతను సాధించి రికార్డు సృష్టించాయి. గణితంలో 837 మంది విద్యార్థులు 100 కి 100 మార్కులు సాధించగా, హిందీలో కూడా 100 మంది విద్యార్థులు సెంటమ్ సాధించారు.
విజయానికి బాటలు వేసిన ‘100 డేస్ ప్లాన్.
ఈ విజయం పక్కా ప్రణాళికతో సాధించిందని అధికారులు పేర్కొన్నారు. విద్యార్థుల సామర్థ్యాన్ని బట్టి వారిని A, B, C, D గ్రేడులుగా విభజించి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ‘100 డేస్ ప్లాన్’ అమలులో భాగంగా ఉపాధ్యాయులు, స్పెషల్ ఆఫీసర్లు రాత్రి సమయాల్లో కూడా బస చేసి విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు.
ప్రభుత్వ విప్ మరియు కురుపాం శాసనసభ్యులు తోయక జగదీశ్వరి మాట్లాడుతూ పదవ తరగతి ఫలితాల్లో పార్వతీపురం మన్యం జిల్లా అద్భుత ప్రగతిని సాధించి, రాష్ట్రస్థాయిలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుందన్నారు. జిల్లాలో గతంలో ఉన్న 93 శాతం ఉత్తీర్ణతను అధిగమించి, ఈ ఏడాది 96 శాతం సాధించడం పట్ల ప్రజాప్రతినిధులు మరియు అధికారులు హర్షం వ్యక్తం చేశారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సన్మానించేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథులు పాల్గొని విద్యార్థులను, ఉపాధ్యాయులను అభినందించారు.
ఈ విజయానికి ప్రధాన కారకులు ఉపాధ్యాయులేనని కొనియాడారు. విద్యార్థులను నిరంతరం ప్రోత్సహిస్తూ, వారిలో చదువు పట్ల ఆసక్తిని పెంపొందించడం వల్లే జిల్లాకు ఈ గౌరవం దక్కిందని తెలిపారు. కేవలం బోధనకే పరిమితం కాకుండా, విద్యార్థుల భవిష్యత్తు కోసం అంకితభావంతో పనిచేసిన టీచర్లు, హెడ్ మాస్టర్లు మరియు వార్డెన్ల కృషి వెలకట్టలేనిదని ప్రశంసించారు. మన్యం జిల్లా విద్యార్థుల ప్రతిభను ముఖ్యమంత్రి గారు మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు సైతం ప్రత్యేకంగా అభినందించినట్లు వేదికపై వెల్లడించారు.
కురుపాం నియోజకవర్గంలోని భద్రగిరి ప్రాంత విద్యార్థులు క్రమశిక్షణతో చదివి మంచి ఫలితాలు సాధించడం గర్వకారణమన్నారు. ఒకప్పుడు మన్యం ప్రాంతంలో చదువు ఎలా సాగుతుందో అని సందేహించిన వారికి, నేటి ఫలితాలు సమాధానం చెప్పాయని వక్తలు అన్నారు. ఇక్కడి విద్యార్థులు ‘మన్యం మాణిక్యాలు’ అని, వారు క్రమశిక్షణతో చదివి జిల్లా పేరును రాష్ట్రవ్యాప్తంగా మారుమ్రోగేలా చేశారని కొనియాడారు.
కార్యక్రమంలో 2026వ సంవత్సరంలో 10వ తరగతి టాపర్స్ గా నిలిచిన విద్యార్థిని విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అతిథులు దుశాలులతో సత్కరించారు.
పార్వతీపురం శాసన సభ్యులు బోనెల విజయచంద్ర* మాట్లాడుతూ పదవ తరగతి ఫలితాల్లో జిల్లా వరుసగా నాలుగోసారి రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకోవడం చారిత్రాత్మకమని, ఇది విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రుల సమష్టి కృషికి నిదర్శనమని కొనియాడారు. పదవ తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. గతంలో వెనుకబడిన జిల్లాగా పేరున్న మన ప్రాంతం, నేడు 96 శాతం ఉత్తీర్ణతతో అభివృద్ధి చెందిన జిల్లాలను సైతం వెనక్కి నెట్టడం గర్వకారణమని ఆయన అన్నారు. ప్రైవేట్ పాఠశాలలు ర్యాంకుల కోసం ప్రకటనలు ఇచ్చుకుంటాయని, కానీ మన జిల్లా మొత్తం రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచి చరిత్ర సృష్టించిందని గుర్తుచేశారు.
పదవ తరగతిలో సాధించిన విజయం కేవలం ఆరంభం మాత్రమేనని, విద్యార్థులు ఇంటర్మీడియట్‌లో మరింత అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. “టెన్త్ టాపర్లుగా ఉన్న వారు కూడా ఇంటర్లో ఇతర వ్యాపకాల వల్ల దారి తప్పే ప్రమాదం ఉంది. ఏకాగ్రత కోల్పోకుండా చదివి మన ప్రాంతం నుండి గొప్ప డాక్టర్లు, ఇంజనీర్లుగా ఎదగాలి” అని పిలుపునిచ్చారు.
విద్యార్థులను ప్రోత్సహించేందుకు తన వంతుగా ఆర్థిక సాయం అందిస్తానని ప్రకటించారు. తన నియోజకవర్గ పరిధిలోని ప్రతిభావంతులైన విద్యార్థులకు కటాఫ్ మార్కుల ఆధారంగా త్వరలోనే స్కాలర్‌షిప్‌లు అందజేస్తామని, రెండు రోజుల్లోనే ఈ కార్యక్రమం ఉంటుందని వెల్లడించారు. జిల్లా యంత్రాంగం మరియు ఉపాధ్యాయుల కృషిని అభినందిస్తూ ఆయన తన ప్రసంగాన్ని ముగించారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సి. యశ్వంత్ కుమార్ రెడ్డి, ఐటిడిఎ ప్రాజెక్ట్ అధికారి ఆర్.వైశాలి, జిల్లా విద్యాశాఖాధికారి పి.బ్రహ్మాజీ రావు, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.








