సిర్పూర్(టి) : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(టి) మండల కేంద్రంలో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న బస్టాండ్ సమస్య మరోసారి చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ జిల్లా మేనేజర్ రాజశేఖర్ శనివారం తాత్కాలిక బస్టాండ్ ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బస్సుల నిలిపివేతకు ఆటంకంగా మారిన పొదలను సిబ్బందితో తొలగింపజేసి, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
అయితే పనులు కొనసాగుతున్న సమయంలో స్థానికుడు గద్దల ప్రవీణ్ అక్కడికి చేరుకుని, ఆ స్థలం గద్దల సుజాతకు చెందిన పట్టా భూమి అని అభ్యంతరం వ్యక్తం చేశారు. బస్టాండ్ నిర్మాణం కోసం ఈ స్థలాన్ని కేటాయించామని ఆర్టీసీ డీఎం, పోలీసులు, పంచాయతీ అధికారులు వివరణ ఇచ్చినా భూయజమానులు వినిపించుకోకపోవడంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ వివాదంపై పైఅధికారులకు సమగ్ర నివేదిక పంపిస్తున్నట్లు డీఎం రాజశేఖర్ తెలిపారు. భూ సమస్యకు త్వరలోనే శాశ్వత పరిష్కారం చూపించి, పూర్తి స్థాయి బస్టాండ్ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.








