జగిత్యాల : జగిత్యాల జిల్లాలో సంక్షేమ శాఖ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఆకస్మికంగా సోదాలు నిర్వహించడం కలకలం రేపింది. మంగళవారం ఉదయం సుమారు 11 గంటల సమయంలో కలెక్టరేట్‌లోని డీడబ్ల్యూఓ (జిల్లా సంక్షేమ అధికారి) కార్యాలయానికి చేరుకున్న ఏసీబీ బృందం, కార్యాలయంలోని రికార్డులను విపులంగా పరిశీలించడం ప్రారంభించింది.
సంబంధిత శాఖలో గతంలో పనిచేసిన ఒక అధికారిపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆ కేసుకు సంబంధించిన ఫైళ్లను ప్రత్యేకంగా సేకరించి, వాటిని అధికారులు సమగ్రంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. కార్యాలయంలోని పలు కీలక పత్రాలు, దస్తావేజులను సీజ్ చేసి పరిశీలిస్తున్నట్లు తెలిసింది.
ఇప్పటికే సంక్షేమ శాఖపై వివిధ స్థాయుల్లో ఆరోపణలు వెలువడిన నేపథ్యంలో, తాజా ఏసీబీ దాడులు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. అధికారుల తనిఖీలు మంగళవారం రాత్రి వరకు కొనసాగనున్నట్లు సమాచారం. పూర్తి స్థాయి విచారణ అనంతరం మరిన్ని వివరాలు వెలువడే అవకాశం ఉంది.








