అనంతపురం : గుత్తి పట్టణంలోని చిరు వ్యాపారస్తులు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి స్వానిధి పథకం కింద పొందుతున్న రుణాలను సమర్థంగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ సూచించారు. మంగళవారం గుత్తి పట్టణంలోని ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న నాగవేణి తోపుడు బండి వద్దకు వెళ్లిన ఆయన, అక్కడి చిరు వ్యాపారులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి పరిస్థితులను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ వ్యాపారులను ఉద్దేశించి మాట్లాడుతూ—పథకం ద్వారా పొందిన రుణాలను సమయానికి తిరిగి చెల్లించగలుగుతున్నారా, రుణాల వల్ల వ్యాపారంలో అభివృద్ధి సాధ్యమైందా, దరఖాస్తు చేసిన వెంటనే రుణాలు అందుతున్నాయా వంటి అంశాలపై వివరాలు సేకరించారు. స్వయం సహాయక సంఘాలకు చెందిన సభ్యులు రుణాల కోసం దరఖాస్తు చేసిన తర్వాత వాటి మంజూరు పరిస్థితులపై కూడా విచారణ చేశారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ మెప్మా ఆధ్వర్యంలో ఈ పథకం కింద రుణాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. చిన్న వ్యాపారస్తులకు స్థిరమైన జీవనోపాధి అవకాశాలు కల్పించడం ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మెప్మా డిపిఎం వెంకటేష్, టీఎంసీలు చంద్రశేఖర్, శ్రీనివాసరెడ్డి, స్వయం సహాయక సంఘాల మహిళలు తదితరులు పాల్గొన్నారు.
గుత్తి ఆర్టీసీ బస్టాండ్ పరిశీలన
గుత్తి మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న నూతన ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ పనులను జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ పరిశీలించారు. పనుల పురోగతిని సమీక్షిస్తూ, బస్టాండ్ నిర్మాణాన్ని వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.
ముందుగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తాత్కాలిక బస్టాండ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని, అనంతరం శాశ్వత బస్టాండ్ నిర్మాణం చేపడతామని తెలిపారు. బస్టాండ్ పరిధిలో డ్రైనేజీ సదుపాయాల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపించాలని సూచించారు.
ఈ పరిశీలనలో ఏపీఎస్ఆర్టీసీ ఆర్ఎం శ్రీలక్ష్మి, సివిల్ డిఈ సురేంద్రబాబు, మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా, తహసిల్దార్ పుణ్యవతి, ఎంపీడీవో ప్రభాకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.








