contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు?.. ఆర్‌బీఐ కీలక చర్యలు

న్యూఢిల్లీ: దేశంలో త్వరలోనే ప్లాస్టిక్ (పాలిమర్) కరెన్సీ నోట్లు చలామణిలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. నగదు వినియోగం భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ (ఆర్‌బీఐ) ఈ దిశగా కీలక అడుగులు వేస్తోంది. ఇటీవల పట్నా, ముంబై నగరాల్లో జరిగిన ఆర్‌బీఐ బోర్డు సమావేశాల్లో ప్లాస్టిక్ నోట్ల అమలు అంశంపై సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం.

ప్రస్తుతం ఉపయోగిస్తున్న కాగితపు నోట్లతో పోలిస్తే ప్లాస్టిక్ నోట్ల ముద్రణ ఖర్చు తక్కువగా ఉండటంతో పాటు అవి ఎక్కువకాలం మన్నే అవకాశం ఉండటం ఆర్‌బీఐను ఈ నిర్ణయానికి ప్రేరేపిస్తున్న ప్రధాన కారణాలుగా తెలుస్తోంది.

ముద్రణ ఖర్చులు భారీగా పెరుగుదల

గత ఆర్థిక సంవత్సరంలో కరెన్సీ నోట్ల ముద్రణ కోసం ఆర్‌బీఐ సుమారు రూ.6,372.8 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. ఇది అంతకుముందు ఏడాదితో పోలిస్తే గణనీయంగా ఎక్కువ. పెరుగుతున్న ఖర్చులను తగ్గించేందుకు, నోట్ల ఆయుష్షును పెంచేందుకు పాలిమర్ నోట్లను ప్రవేశపెట్టాలని ఆర్‌బీఐ భావిస్తోంది.

కొత్తగా తీసుకురాబోయే ప్లాస్టిక్ నోట్లను సులభంగా వినియోగించుకునేలా ఏటీఎం యంత్రాల్లో కూడా సాంకేతిక మార్పులు చేయనున్నారు. ఇందుకోసం దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా ప్లాస్టిక్ నోట్లను విడుదల చేయాలని ఆర్‌బీఐ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

రికార్డు స్థాయిలో నగదు చలామణి

డిజిటల్ చెల్లింపులు వేగంగా పెరుగుతున్నప్పటికీ, మార్కెట్లో నగదు చలామణి మాత్రం రికార్డు స్థాయికి చేరింది. ప్రస్తుతం దేశంలో సుమారు రూ.42.86 లక్షల కోట్ల మేర నగదు చలామణిలో ఉన్నట్లు అంచనా.

చిరిగిన నోట్ల సమస్యకు చెక్?

మార్కెట్లో పాడైపోయిన, చిరిగిపోయిన నోట్లను సేకరించి వాటిని నిర్మూలించడం ఆర్‌బీఐకి పెద్ద సవాలుగా మారింది. గత ఏడాదిలోనే సుమారు 23.8 బిలియన్ల పాత నోట్లను వెనక్కి తీసుకున్నట్లు సమాచారం. వీటిలో ఎక్కువగా రూ.500, రూ.100 నోట్లే ఉన్నాయి.

ప్లాస్టిక్ నోట్లు అమల్లోకి వస్తే ఈ సమస్య చాలా వరకు తగ్గే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. ఎందుకంటే పాలిమర్ నోట్లు సాధారణ కాగితపు నోట్ల కంటే ఎక్కువకాలం మన్నే లక్షణం కలిగి ఉంటాయి.

2012లోనే ప్రయత్నం.. ఇప్పుడు మళ్లీ చర్చల్లోకి

ఇదే అంశంపై గతంలో 2012లో యూపీఏ ప్రభుత్వం ఐదు నగరాల్లో రూ.10 ప్లాస్టిక్ నోట్లను ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టాలని ప్రయత్నించింది. అయితే సాంకేతిక కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ అప్పట్లో నిలిచిపోయింది.

ఇప్పుడు ఆధునిక సాంకేతికత అందుబాటులోకి రావడం, అంతర్జాతీయ స్థాయిలో పాలిమర్ నోట్ల వినియోగం పెరగడం వంటి కారణాలతో ఆర్‌బీఐ ఈ ప్రతిపాదనను మళ్లీ పరిశీలిస్తున్నట్లు సమాచారం.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :