విజయనగరం జిల్లా – కొత్తవలస : కొత్తవలస రాజన్నకోలనీలో నివాస ప్రాంతాల మధ్య కొనసాగుతున్న డంపింగ్ యార్డును తక్షణమే తరలించాలని డిమాండ్ చేస్తూ స్థానిక గ్రామస్థులు, బాధితులు చేపట్టిన ఆందోళన మంగళవారం నాటికి 56వ రోజుకు చేరుకుంది. జనసేన పార్టీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ నిరసనలో భాగంగా మంగళవారం కాలనీలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.
జిల్లా పరిషత్ సీఈఓ, డీపీఓ మల్లికార్జునరావు, ఎంపీడీఓ రమణయ్య, ఈఓ ప్రసాద్ తదితర అధికారులు పంచాయతీ శానిటరీ సిబ్బందితో కలిసి డంపింగ్ యార్డు ప్రాంతాన్ని పరిశీలించేందుకు వచ్చారు. అయితే, అధికారులు నిబంధనలకు విరుద్ధంగా అదే ప్రదేశంలో డంపింగ్ యార్డును కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నారని భావించిన స్థానిక మహిళలు, గ్రామస్థులు అధికారులను అక్కడికక్కడే నిలదీశారు.
ఇదే సమయంలో శానిటరీ సిబ్బంది ట్రాక్టర్ ద్వారా భారీగా చెత్తను తీసుకువచ్చి కాలనీ సమీపంలో డంప్ చేయడానికి ప్రయత్నించగా, ఆగ్రహించిన గ్రామస్థులు ట్రాక్టర్‌ను అడ్డుకుని వెనక్కి పంపించారు. “నివాస ప్రాంతాల మధ్య చెత్త వేయడం మానవత్వానికి విరుద్ధం” అంటూ మహిళలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
గ్రామస్థులు అధికారుల ముందు పలు ప్రశ్నలు ఉంచారు. తహసిల్దార్ ఇప్పటికే డంపింగ్ యార్డు కోసం రెండు ప్రత్యామ్నాయ స్థలాలను కేటాయించినప్పటికీ, అక్కడ చెత్త వేయకుండా మళ్లీ కాలనీ సమీపానికే ఎందుకు తీసుకువస్తున్నారని ప్రశ్నించారు. అలాగే, డంపింగ్ యార్డు నిర్వహణకు సంబంధించిన ఎంఆర్ఓ అనుమతులు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు క్లియరెన్స్, జిల్లా కలెక్టర్ ఉత్తర్వులను ప్రజలకు చూపించాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం డంపింగ్ యార్డు మానవ నివాసాలకు కనీసం 500 మీటర్ల దూరంలో ఉండాలని, కానీ ప్రస్తుత యార్డు కేవలం 100 మీటర్లలోపే ఉండటంతో తీవ్ర దుర్వాసన, వాయు కాలుష్యం వ్యాపించి చిన్నారులు, వృద్ధులు అనారోగ్యానికి గురవుతున్నారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై స్పందించిన ఎస్.కోట నియోజకవర్గ జనసేన నాయకుడు వబ్బిన సన్యాసి నాయుడు జిల్లా పంచాయతీ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి, ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టే చర్యలను వెంటనే నిలిపివేయాలని హెచ్చరించారు. స్థానిక ప్రజల సమస్యకు శాశ్వత పరిష్కారం లభించే వరకు జనసేన పార్టీ బాధితులకు అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో మొగ్గ ప్రశాంత్, ఎవర్న రామకృష్ణ, కనకరాజు, పైడమ్మ, అప్పలనరసమ్మ, అరుణ, దేవి, సూరమ్మ, నాగమణి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.








