పార్వతీపురం – బలిజిపేట : ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా లబ్ధిదారులకు అందించే రేషన్ సరుకుల పంపిణీలో పూర్తి పారదర్శకత ఉండాలని పార్వతీపురం మన్యం జిల్లా జాయింట్ కలెక్టర్ సి. యశ్వంత్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
బుధవారం ఆయన బలిజిపేట మండలంలో పర్యటించి, వెంగాపురం గ్రామంలోని చౌక ధరల దుకాణాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీలో భాగంగా షాపులోని బియ్యం నిల్వలను స్వయంగా పరిశీలించి, వాటి నాణ్యతను పరిశీలించారు. స్టాక్ రిజిస్టర్లను క్షుణ్ణంగా తనిఖీ చేసిన ఆయన, ఈ-పోస్ (e-PoS) యంత్రాల ద్వారా జరుగుతున్న పంపిణీ ప్రక్రియను కూడా పర్యవేక్షించారు. సాంకేతిక ఇబ్బందులు లేకుండా సరుకులు పంపిణీ జరిగేలా చూడాలని అధికారులకు సూచించారు.
ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన లబ్ధిదారులతో ఆయన నేరుగా మాట్లాడి, ప్రభుత్వ సరఫరాలు సక్రమంగా అందుతున్నాయా, డీలర్లు సమయానికి దుకాణాలు తెరుస్తున్నారా అనే విషయాలను తెలుసుకున్నారు. సరుకుల పంపిణీపై లబ్ధిదారులు సంతృప్తి వ్యక్తం చేశారు.
అనంతరం జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, రేషన్ పంపిణీలో ఎటువంటి అవకతవకలకు తావుండకూడదని స్పష్టం చేశారు. ప్రతి కార్డుదారునికి ప్రభుత్వం నిర్ణయించిన మేరకు తూకంలో తేడా లేకుండా సరుకులు అందించాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీలర్లను హెచ్చరించారు.
ఈ తనిఖీ కార్యక్రమంలో స్థానిక రెవెన్యూ అధికారులు, పౌర సరఫరాల శాఖ సిబ్బంది, గ్రామ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.








