contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

పేపర్ మిల్లులో వెంటనే కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించాలి – జే. మల్లికార్జున్

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా: కాగజ్‌నగర్‌లోని ‘సిర్పూర్ పేపర్ మిల్స్ లిమిటెడ్’ (SPM)లో వెంటనే గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించాలని సిర్పూర్ పేపర్ మిల్ మజ్దూర్ యూనియన్ అధ్యక్షులు, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు జే. మల్లికార్జున్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన హైదరాబాద్‌లో అడిషనల్ లేబర్ కమిషనర్ ఈ. గంగాధర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా మల్లికార్జున్ మాట్లాడుతూ, జేకే పేపర్ లిమిటెడ్ యాజమాన్యం 2018 ఆగస్టులో సిర్పూర్ పేపర్ మిల్లును టేకోవర్ చేసిందని తెలిపారు. ప్రస్తుతం పరిశ్రమలో 373 మంది పర్మినెంట్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్ కార్మికులతో కలిపి మొత్తం 2,188 మంది పనిచేస్తున్నారని పేర్కొన్నారు.

పరిశ్రమ పునఃప్రారంభమై ఏడు సంవత్సరాలు కావస్తున్నప్పటికీ ఇప్పటివరకు గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించకపోవడంతో కార్మికుల వేతన ఒప్పందాలు, ఇతర సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎన్నికల నిర్వహణకు యాజమాన్యం సహకరించడం లేదని, దీనికి నిరసనగా అన్ని కార్మిక సంఘాలు జేఏసీగా ఏర్పడి పరిశ్రమ ముందు రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నట్లు తెలిపారు. లేబర్ కోడ్ నెపంతో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్‌కు ఎన్నికలు నిర్వహించే అధికారం లేదంటూ యాజమాన్యం హైకోర్టులో రిట్ పిటిషన్ నెం. 3966/2026 దాఖలు చేసిందని చెప్పారు.

ప్రభుత్వ లేబర్ డిపార్ట్మెంట్ జీపీ కూడా యాజమాన్యానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే భావన కార్మికుల్లో ఆందోళన కలిగిస్తోందని మల్లికార్జున్ పేర్కొన్నారు. రాష్ట్రంలో కొత్త లేబర్ కోడ్లు ఇంకా పూర్తిస్థాయిలో అమల్లోకి రాలేదని, పాత చట్టాల ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.

లేబర్ కమిషనర్ వెంటనే జోక్యం చేసుకుని కోర్టు వ్యవహారాలు త్వరితగతిన పరిష్కరించి గుర్తింపు ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కోశాధికారి వంగూరి రాములు కూడా పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :