ప్రవాసాంధ్రుడు, వైసీపీ మద్దతుదారుడిగా గుర్తింపు పొందిన పంచ్ ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ముఖ్యంగా ఆర్యవైశ్య కమ్యూనిటీని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్యవైశ్య మహాసభ చైర్మన్, మాజీ ఎంపీ టీజీ వెంకటేశ్ కర్నూలులో మీడియా సమావేశం నిర్వహించి పంచ్ ప్రభాకర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
పంచ్ ప్రభాకర్‌పై క్రిమినల్ కేసులు నమోదు చేయించేందుకు చర్యలు తీసుకుంటామని టీజీ వెంకటేశ్ స్పష్టం చేశారు. అతడిని చట్టపరంగా కటకటాల్లోకి నెట్టేవరకు ఆర్యవైశ్య సమాజం నిద్రపోదని హెచ్చరించారు. ఆర్యవైశ్య కమ్యూనిటీ గౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడటం తీవ్రంగా ఖండనీయమని పేర్కొన్నారు.
పంచ్ ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ రాబోయే రోజుల్లో జిల్లాల వారీగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని టీజీ వెంకటేశ్ తెలిపారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు సహజమే అయినప్పటికీ, ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని అవమానకర వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని మండిపడ్డారు.
ఈ సందర్భంగా తన గత వ్యాఖ్యలను కూడా టీజీ వెంకటేశ్ వివరణ ఇచ్చారు. రాయలసీమలో మీసాలు తిప్పుకుని తిరిగిన కొందరు నాయకులు తర్వాత తన వద్దకు వచ్చారని మాత్రమే తాను అన్నానని, ఆ వ్యాఖ్యలను ఒక సామాజిక వర్గానికి ఆపాదిస్తూ పంచ్ ప్రభాకర్ మాట్లాడటం ఆయన అవివేకానికి నిదర్శనమని పేర్కొన్నారు. రెండు సామాజిక వర్గాల మధ్య విభేదాలు సృష్టించేందుకే ఇలాంటి కుట్రపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు.
“ప్రభాకర్‌కు నిజంగా ధైర్యం ఉంటే విదేశాల్లో ఉండకుండా ఇండియాకు రావాలి. ఇక్కడికి వస్తే ఆర్యవైశ్యులే అతడికి తగిన బుద్ధి చెబుతారు” అంటూ టీజీ వెంకటేశ్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. చట్టపరంగా కఠిన చర్యలు తీసుకునేలా అధికారులపై ఒత్తిడి తీసుకువస్తామని ఆయన స్పష్టం చేశారు.








